డీజిల్ కార్ల అమ్మకాలపై సుప్రీంకోర్టు కొరడా

16 Dec, 2015 11:21 IST|Sakshi
డీజిల్ కార్ల అమ్మకాలపై సుప్రీంకోర్టు కొరడా

కాలుష్యభూతం కోరలు చాస్తున్న దేశ రాజధాని ఢిల్లీలో లగ్జరీ డీజిల్ కార్ల అమ్మకాలపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. 2000 సీసీ దాటిన డీజిల్ ఎస్‌యూవీలు, కార్ల అమ్మకాలపై మార్చి 31వ తేదీ వరకు నిషేధం విధిస్తూ నిర్ణయం వెలువరించింది. దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఇకమీదట అసలు కొత్త డీజిల్ వాహనాలను రిజిస్టర్ చేయకూడదని ఇంతకుముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో డీజిల్ కార్ల కొనుగోళ్లు ఆపాలని ఎన్‌జీటీ తెలిపింది. జనవరి 6వ తేదీన తదుపరి విచారణ జరిగేవరకు ఇవి తాత్కాలిక ఉత్తర్వులుగా ఉంటాయని చెప్పింది.

సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ కాలుష్యంపై స్పందించింది. 2005 కంటే ముందుగా రిజస్టర్ అయిన ట్రక్కులను ఢిల్లీ పరిసరాల్లోకి ప్రవేశించకుండా నిషేధించేందుకు సుప్రీం అనుమతించింది. అలాగే, అసలు దేశ రాజధానిలోకి వచ్చే ట్రక్కుల మీద గ్రీన్ టాక్స్‌ను కూడా రెట్టింపు చేసింది. సరి - బేసి సంఖ్యల కోడ్ ఆధారంగా రోజూ రోడ్డుమీదకు వచ్చే కార్ల సంఖ్యను సగానికి తగ్గించాలన్న ఢిల్లీ సర్కారు నిర్ణయం ఫలితాన్నిస్తుందని తాము అనుకోవట్లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే తాము దాన్ని ఆపబోమని, కావాలంటే కొనసాగించుకోవచ్చని చెప్పింది.

అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ ఇప్పటికే చెడ్డపేరు తెచ్చుకుందని, దేశ రాజధానిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఇంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ అన్నారు. కోర్టు ప్రాంగణంలో కూడా ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న మొత్తం కార్లలో 23 శాతం డీజిల్ కార్లే ఉన్నాయి. పెట్రోలు కార్ల కంటే వీటినుంచి ఏడున్నర రెట్లు ఎక్కువగా కలుషిత పదార్థాలు బయటకు వస్తాయి. డీజిల్ పొగ కేన్సర్ కారకం అవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇంతకుముందు హెచ్చరించింది.

>
మరిన్ని వార్తలు