‘కరోనా.. ఎబోలా, నిఫా వైరస్‌ మాదిరిగా కాదు’

15 Mar, 2020 08:50 IST|Sakshi

అంత్యక్రియలపై మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కోవిడ్‌-19 కారణంగా మృతి చెందిన 68 ఏళ్ల మహిళ అంత్యక్రియలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. మృతుల శరీరాల నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేకపోయినప్పటికీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలను తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదం చేస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధి అయిన కోవిడ్‌ దగ్గు, తుమ్ముల వల్ల బయటకు వచ్చే ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని, మార్చురీ నుంచి లేదా మృతదేహం నుంచి వ్యాపించే అవకాశం లేదని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.
(చదవండి: కోవిడ్‌.. జాతీయ విపత్తు)

ఎబోలా, నిఫా వంటి వైరస్‌లు మృతుల శరీరాల నుంచి వెలువడే ద్రవాలను తాకడం ద్వారా రావచ్చుకానీ కరోనా అలా కాదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం శరీరాన్ని తగు విధంగా చుట్టి దహనం/ఖననం చేయవచ్చునని పేర్కొనడం గమనార్హం. ఇక కోవిడ్‌ వైరస్‌ ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది మరణించగా... లక్షా 50 వేల మంది కోవిడ్‌ అనుమానితులుగా ఉన్నారు. భారత్‌లో ఈ వైరస్‌ సోకి ఇద్దరు మరణించగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 88కి చేరింది.
(భారత్‌లో పాజిటివ్‌ కేసులు 88)
(ట్రంప్‌నకు కరోనా టెస్ట్‌ : రిపోర్ట్‌లో తేలిందిదే..)

మరిన్ని వార్తలు