కుక్కల్ని కాల్చినట్లు.. కాల్చిపారేస్తున్నారు!

13 Jan, 2020 11:30 IST|Sakshi

బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ వివాదస్పద వ్యాఖ్యలు

కోల్‌కతా: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌, అసోం, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి వాళ్లను కుక్కల్ని కాల్చినట్లు కాల్చిపారేస్తున్నారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ఓట్లు వేసిన వాళ్లను కాపాడుకునేందుకే దీదీ ఇలా చేస్తున్నారని విమర్శించారు. నదియా జిల్లాలో ఆదివారం జరిగిన సభకు హాజరైన దిలీప్‌ ఘోష్‌ మమత సర్కారుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబరులో జరిగిన ఆందోళనల్లో భారీగా ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యాయన్నారు. రైల్వే, రవాణా ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై లాఠీచార్జీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయలేదన్నారు.(‘తొలుత ఇక్కడే అమలు.. ఎవరూ ఆపలేరు’)

‘మీరు ధ్వంసం చేస్తున్న ఆస్తులు ఎవరివి అనుకుంటున్నారు. అవి మీ నాన్నవి కాదు... ప్రభుత్వ ఆస్తులు. పన్ను కడుతున్న ప్రజలవి. మీరు ఇక్కడికి వస్తారు. మా తిండి తింటారు. ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు. ఇదేమైనా మీ జాగీరా? మిమ్మల్ని లాఠీలతో చితక్కొడతాం. కాల్చిపడేస్తాం. జైళ్లో పెడతాం అంటూ దిలీప్‌ ఘోష్‌ ఆందోళనకారులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా... దేశంలోకి దాదాపు రెండు కోట్ల మంది ముస్లింలు చొరబడ్డారని.. వారిలో కోటి మంది పశ్చిమ బెంగాల్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. బెంగాలీ హిందువుల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిని మమత రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

కాగా డిసెంబరు 31, 2014 నాటికి ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లేదా పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించేలా నరేంద్ర మోదీ సర్కారు చట్టం తీసుకవచ్చిన విషయం తెలిసిందే. ఇక పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై పునరాలోచన చేయాలని, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)లను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్న విషయం విదితమే. (సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్‌ వద్దు.. ప్రధానితో మమత)

చదవండి: ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు