'నా మనసులో మాట చెప్పడం ఇష్టంలేదు'

3 Mar, 2016 14:08 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదల కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై వ్యాఖ్యానించడానికి,  రాజీవ్ కుమారుడు,  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాకరించారు. దీనిపై ఏం చేయాలో కేంద్రమే  నిర్ణయం  తీసుకోవాలన్నారు.  ఆ అంశంపై తానేమీ చెప్పలేనన్నారు.  దీనిపై గురువారం  స్పందించిన రాహుల్  దీనిపై తన మనసులోని మాటను బయటపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు.

అయితే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేందుకు  నిర్ణయించింది.  ఈ నేపథ్యంలో రాజీవ్ దోషులను విడుదల చేస్తే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదని లోకసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే  గురువారం పార్లమెంట్‌లో అన్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశ ఐక్యతకే భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. తమిళనాడు  రాసిన లేఖను కేంద్ర హోంశాఖ బయటపెట్టడం శోచనీయమన్నారు.

కాగా తమిళనాడు రాసిన లేఖను పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్   సభలో తెలిపారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని ఆయన అన్నారు.  రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు నిందితులను  విడుదల చేసే విషయంలో, కేంద్రం అనుమతి కావాలంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ  బుధవారం  లేఖ రాసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు