కాంగ్రెస్‌ నేత జాఫర్‌ షరీఫ్‌ కన్నుమూత

25 Nov, 2018 15:07 IST|Sakshi

పీవీ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేసిన జాఫర్‌ భాయి

సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సీకే జాఫర్‌ షరీఫ్‌ (85) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం నమాజ్‌కు వెళ్లే క్రమంలో కారు ఎక్కుతుండగా షరీఫ్‌ ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షరీఫ్‌ ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. షరీఫ్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులిద్దరూ ఇప్పటికే మరణించారు. కొంత కాలంగా షరీఫ్‌ ఆరోగ్యం బాగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఆయన గుండెకు పేస్‌ మేకర్‌ అమర్చా ల్సి ఉండగా, ఈ లోపే చనిపోయారని ఆయన సన్నిహితుడు, ఎమ్మెల్యే హారిస్‌ చెప్పారు.

ప్రముఖుల నివాళి
షరీఫ్‌ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మరో గొప్ప నేతను కోల్పోయిందన్నారు.
కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న చిల్లకూరు పట్టణంలో 1933 నవంబర్‌ 3న షరీఫ్‌ జన్మించారు. కర్ణాటక మాజీ సీఎం నిజలింగప్ప అనుచరుడిగా షరీఫ్‌ కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇందిరాగాంధీకి అత్యంత విధేయుడిగా పేరుగాంచిన ‘జాఫర్‌ భాయి’ బెంగళూరు నార్త్‌ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. పీవీ నరసింహారావు హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు.


ఎంపీగా ఏడు సార్లు
కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవులు చేపట్టిన జాఫర్‌ షరీఫ్‌ 1980 నుంచి 1984 మధ్య రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు. నీటిపారుదల, బొగ్గు మంత్రిత్వ శాఖలనూ ఆయన చేపట్టారు. 1991-95 మధ్య కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఏడు సార్లు ఎంపీగా పనిచేసిన షరీఫ్‌ 2009లో చివరిసారిగా ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి చెందిన డీబీ చంద్రగౌడ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా