గ్యాస్ సంక్షోభం

10 Jul, 2014 00:41 IST|Sakshi
గ్యాస్ సంక్షోభం

రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం నెలకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. సిలిండర్ల కొరత వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకునే కృతిమ కొరతను సృష్టిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే, కొత్త సిలిండర్ల కారణంగా తాత్కాలికంగా ఈ సంక్షోభం బయలు దేరిందని ఐవోసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కొన్ని నెలలుగా బుక్ చేసిన రెండు, మూడు రోజుల్లో గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సరఫరా అవుతున్నారుు. గ్యాస్‌కు ఆధార్ కార్డును లింక్ పెట్టి, నగదు బదిలీ పథ కం అమల్లోకి రావడంతో త్వరితగతిన సిలిండర్లు వినియోగదారుల ముగింట వాలాయి. అలాగే, గ్యాస్ సిలిండర్లు సకాలంలో వినియోగదారులకు చేరని పక్షంలో డీలర్ల నడ్డి విరిగేది. అయితే, ఆ విధానం కాస్త కొత్త ప్రభుత్వం రాకతో మరుగున పడింది.

ధరల తగ్గింపు నినాదంతో కేంద్రంలో కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం  ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే రైలు చార్జీల్ని వడ్డించింది. పెట్రోల్, డీజిల్ మోత ప్రజల నెత్తిన వేసింది. ఇక, గ్యాస్ భారం వేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం మొదలైంది. పార్లమెంట్ బడ్జెట్ దాఖలులో గ్యాస్ ధర పెంపు ప్రకటన వెలువడే అవకాశాలు ఉండడంతో కృత్రిమ కొరత సృష్టించే పనిలో డీలర్లు పడ్డారు. అదే సమయంలో చమురు సంస్థలు డిమాండ్‌కు తగ్గట్టుగా సిలిండర్లను సరఫరా చేయడం లేదన్న ఆరోపణలు డీలర్ల వైపు నుంచి వస్తున్నాయి.

ఎదురుచూపులు: పది రోజులుగా రాజధాని నగరంలో సిలిండర్ల కొరత నెలకొంది. ఇది వరకు బుక్ చేసిన రెండు మూడు రోజుల్లో వచ్చే సిలిండర్లు ప్రస్తుతం పది రోజులైనా రాక పోవడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సిలిండర్ ఎప్పుడొస్తుందని డీలర్లకు ఫోన్లు చేయలేని పరిస్థితి. ఇందుకు కారణం సిలిండర్ల బుకింగ్‌కు ప్రత్యేక ఎస్‌ఎంఎస్ విధానం అమల్లో ఉండటమే. దీంతో సిలిండర్లు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని  ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల గత నెల బుక్ చేసిన సిలిండర్లు ఇంకా రాలేదంటూ వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఆందోళన బాట: కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ ఓ వైపు ప్రచారం సాగుతుంటే, మరో వైపు మీంజూర్‌లో ఐవోసీ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంలో సిబ్బంది ఆం దోళనబాట పట్టడంతో ఫిల్లింగ్‌కు ఆటం కం ఏర్పడి ఉంది. సిబ్బంది తమ ఆందోళనను ఉధృతం చేసినదృష్ట్యా, బుధవారం నుంచి పూర్తిగా ఆ కేంద్రంలో గ్యాస్ ఫిల్లింగ్ ఆగినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక్కడ ఫిల్లింగ్ సిలిండర్ల సంఖ్యను సైతం తగ్గించడం బట్టి చూస్తే, ధర పెరగనుండడాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షోభాన్ని సృష్టిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఐవోసీ అధికారులు దీన్ని ఖండిస్తున్నారు. ఇక్కడి నుంచి రోజుకు 120 లోడ్లు డీలర్లకు సరఫరా అవుతున్నాయని వివరిస్తున్నారు.

అయితే, పదేళ్ల పాటు వినియోగంలో ఉన్న సిలిండర్లను వెనక్కు పంపించి, వాటి స్థానంలో కొత్త సిలిండర్లను తెప్పిస్తున్నామని పేర్కొంటున్నారు. కొత్త సిలిండర్ల రాకలో జాప్యం నెలకొన్నందున, ఇక్కడ కాంట్రాక్టు సిబ్బందిని కుదించినట్లు వివరించారు. ప్రస్తుతం 60 లోడ్ల మేరకు సిలిండర్ల ఫిల్లింగ్ మాత్రం చేయాల్సి ఉందని, దీన్ని అర్థం చేసుకోని సిబ్బంది ఆందోళన బాట పట్టారని చెబుతున్నారు. వీరి ఆందోళన కారణంగా ఫిల్లింగ్‌కు ఆటంకం ఏర్పడిందని, మరో రెండు మూడు రోజుల్లో కొత్త సిలిండర్లు రాగానే, సిలిండర్ల కొరత సమసి పోవడం ఖాయం అని స్పష్టం చేస్తున్నారు.  అంతలోపు సిలిండర్ల ధర పెరిగిన పక్షంలో చమురు సంస్థలకు లాభం, వినియోగ దారుడి నెత్తిన భారం ఖాయం.

మరిన్ని వార్తలు