రెరా ముద్ర ఉన్నదే ‘రియల్‌’ ఎస్టేట్‌

3 Jul, 2019 19:54 IST|Sakshi

న్యూఢిల్లీ : రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) వద్ద రిజిస్టర్‌ కాకుండా ఏ బిల్డరైనా, ప్రమోటరైనా ఫ్లాట్లు, భవనాలు, ఇంకా ఏ రకమైన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టును కూడా విక్రయించడానికి వీల్లేదని గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రియల్‌ ఎస్టేట్‌(రెగ్యులేషన్‌, డెవలప్‌మెంట్‌) చట్టం 2016 ప్రకారం రెరా వద్ద రిజిస్టర్‌ చేసుకోకుండా ఏ బిల్డరు, ఏ ప్రమోటర్‌.. తమ వెంచర్లను ప్రచారం చేసుకోవడం, బుక్‌ చేసుకోవడం, విక్రయించడం వంటి కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబడవని ఆయన తెలిపారు. రెరా చట్టం అమల్లోకి వచ్చిన నాటికే నిర్మాణంలో ఉండి ప్రాజెక్టు పూర్తయినట్టుగా జారీ చేసే ధ్రువీకరణ పత్రం పొందని బిల్డర్లు మూడు నెలల వ్యవధిలోగా తమ ప్రాజెక్టును రెరా వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. 

రెరా వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోని బిల్డర్లు, ప్రమోటర్లు.. రెరా ఆదేశాలు, మార్గదర్శకాలను అత్రికమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాంటి వారికి రెరా చట్టంలోని సెక్షన్‌ 59 కింద మూడేళ్ల జైలు శిక్ష లేదా ప్రాజెక్టు అంచనా వ్యయంలో పదిశాతం జరిమానా విధించే నిబంధన ఉన్నట్టు ఆయన చెప్పారు. రెరా వద్ద రిజిస్టర్‌ కాని బిల్డర్ల వద్ద ఫ్లాట్లు కొన్న వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తగిన ఫోరంలో ఫిర్యాదు చేసి చట్టపరంగా వారి హక్కులను పరిరక్షించుకోవచ్చని తెలిపారు. దేశంలో ఎన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులు రెరా వద్ద రిజిస్టర్‌ అయ్యాయనే వివరాలను తమ మంత్రిత్వ శాఖ సేకరించిందని పేర్కొన్నారు. రెరా వ్యవస్థను ప్రతి రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది కనుక.. ఆ వివరాలన్నీ ఆయా రాష్ట్రాల రెరా వద్దే లభ్యమవుతామని వెల్లడించారు. 

వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉపందుకున్న కార్గో రవాణా
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కార్గో రవాణా గణనీయంగా పెరిగినట్టు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 2017-18లో 257 మెట్రిక్‌ టన్నుల సరుకులు రవాణా కాగా, 2018-19 నాటికి అది 669 టన్నులకు చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో హ్యాండ్లింగ్‌ కాంప్లెక్స్‌ ఏడాదికి 20 వేల మెట్రిక్‌ టన్నుల రవాణా సామర్థ్యం కలిగి ఉందన్నారు. 

ఎయిర్‌ కార్గో రవాణా కార్యకలాపాలను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎయిర్‌లైన్స్‌ సర్వీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 2017లో విశాఖలో అంతర్జాతీయ ఎయిర్‌ కార్గో టెర్మినల్‌ ప్రారంభించినట్టు గుర్తుచేశారు. ఈ టెర్మినల్‌ కార్యనిర్వహణ యాజమాన్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌కు అప్పంగించడం జరిగిందన్నారు. 558 చ.మీ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ టెర్మినల్‌లో కార్గో రవాణా నిమిత్తం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కోసం ట్రక్‌ డాక్‌ ఏరియా, తనిఖీలు చేపట్టే హాలు, స్ట్రాంగ్‌ రూమ్‌, కోల్డ్‌ స్టోరేజ్‌, ప్రమాదకరమైన సరుకు నిల్వచేసే షెడ్‌ వంటి సౌకర్యాలను కల్పించినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు