కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధన ముమ్మరం

31 Mar, 2020 20:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ రూపొందించే ప్రక్రియలో భారత్‌లో పరిశోధన ముమ్మరంగా సాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టం చేసింది. ఈ దిశగా ప్రభుత్వ సారథ్యంలో సరైన దిశలో సన్నాహాలు సాగుతున్నాయని పేర్కొంది. ఇక భారత్‌లో గడిచిన 24 గంటల్లో 227 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1251కి చేరుకోగా, 32 మంది మరణించారని తెలిపారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచే ప్రక్రియ పకడ్బందీగా సాగుతోందని చెప్పారు. వైరస్‌ అధికంగా వ్యాపించిన హాట్‌స్పాట్‌లను గుర్తించి ఇతర ప్రాంతాలకు ఇది విస్తరించకుండా ప్రభుత్వం కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను విస్తృతంగా చేపడుతోందని అన్నారు. కరోనా రోగులకు వైద్య సాయం అందించే వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకువస్తోందని చెప్పారు.

ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలని, దీనిపై భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఇక ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించే అవసరం లేదని, కేవలం దగ్గు ఉంటేనే మాస్క్‌లు ధరించాలని..ముఖ్యంగా సామాజిక దూరం పాటించడమే కీలకమని చెప్పుకొచ్చారు. ​కరోనా వైరస్‌తో అత్యధిక మరణాలు అధికంగా గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నమోదయ్యాయని అన్నారు. ప్రజలు సకాలంలో సమాచారం అందించకపోవడంతో కొద్దిరోజులుగా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజలు లాక్‌డౌన్‌ను కఠినంగా పాటిస్తేనే ఈ మహమ్మారిని కట్టడి చేయగలుగుతామన్నారు.

చదవండి : కరోనా.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌

మరిన్ని వార్తలు