పాకిస్థాన్ కు ఎల్ ఆర్ పంపనున్న భారత్

5 Jan, 2016 18:28 IST|Sakshi
పాకిస్థాన్ కు ఎల్ ఆర్ పంపనున్న భారత్

న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుకున్న కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్థాన్ ను భారత్ కోరనుంది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వానికి లెటర్ రొగేటరీ(ఎల్ ఆర్) పంపనుంది. సైనిక ఆపరేషన్ లో మృతి చెందిన ఉగ్రవాదుల డీఎన్ఏ నమూనాలు, ఫోన్ కాల్స్ తదితర వివరాలు పాకిస్థాన్ కు అందజేయనుంది.

పఠాన్ కోట్ లో సైనిక బలగాల చేతిలో హతమైన ఆరుగురు ఉగ్రవాద మృతదేహాలకు వీలైనంత త్వరగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వీటితో పాటు పాకిస్థాన్ లోని సూత్రధారుల నుంచి ఉగ్రవాదులకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు ఎల్ ఆర్ ద్వారా పొరుగు దేశానికి పంపించనుంది. ఈ వివరాలతో కుట్రదారులను పట్టుకోవాలని పాక్ ప్రభుత్వ వర్గాలకు భారత్ అధికారికంగా విజ్ఞప్తి చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

కొన్ని రకాల న్యాయ సేవల కోసం కోర్టు ద్వారా విదేశీ కోర్టును అభ్యర్థించడానికి ఎల్ ఆర్ ను పంపుతారు. న్యాయ సేవ ప్రక్రియ ప్రాసెస్, ఆధారాలు పంపడానికి ఎల్ ఆర్ ను వినియోగిస్తుంటారు. పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే-ఈ-మొహ్మద్ తీవ్రవాద సంస్థ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు