మీ నాయకుడెవరు?

23 Sep, 2014 22:11 IST|Sakshi

 ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడెవరో ప్రకటించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బీజేపీకి సవాలు విసిరారు. నరేంద్ర మోడీ పేరిట ఓట్లు అడగటాన్ని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోజువారీ నిర్ణయాలు చేసేది ముఖ్యమంత్రి అని, ప్రధాన మంత్రి కాదని పేర్కొన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఉన్నపక్షంలో వారిని తొలగించేందుకు వెనుకాడబోమని చవాన్ స్పష్టం చేశారు.

యువతకు, మహిళలకు మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు. అదే సమయంలో తమ నియోజకవర్గాలను తీర్చిదిద్దిన వారిని విస్మరించబోమని కూడా ఆయన తేల్చి చెప్పారు. దీనిని బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో అనుభవానికి, యువతకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు చవాన్ సూచనప్రాయంగా వెల్లడించారు. ‘మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరు. ఢిల్లీలో మాకు మోడీ ఉన్నాడని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుండవచ్చు. కానీ ఎలా సాధ్యమవుతుంది. ఇక్కడ రోజువారీ వ్యవహారాలను నడపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా?’ అని సీఎం వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడెవరో ప్రకటించాలని అన్నారు. నాయకత్వం అంశంపై బీజేపీ, శివసేనల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. మహాకూటమిగా ఉద్ధవ్ ఠాక్రే నాయకునిగా ఉంటారని శివసేన ఇదివరకే ప్రకటించింది. ప్రజలు పార్టీని, పార్టీ విధానాలను, పార్టీ నేతను బట్టి ఎన్నుకుంటారని చవాన్ పేర్కొన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ నాయకులను ప్రకటించాయని, బీజేపీ మాత్రమే ఇంతవరక వెల్లడించలేదని అన్నారు.


 మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారానికి వస్తుందని చవాన్ ధీమా వ్యక్తం చేశారు. గత రెండు నెలల కాలంలో అనేక ప్రజల నిర్ణయాల్లో మార్పు వచ్చిందన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజల తీర్పు విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు, రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఓటర్లు భిన్నంగా స్పందిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిస్తారా అన్న ప్రశ్నకు చవాన్ సానుకూలంగా స్పందించారు.

 అయితే గత ఐదు, పదేళ్లుగా నియోజకవర్గాలను తీర్చిదిద్దిన ఎమ్మెల్యేలను వదిలివేయబోమని స్పష్టం చేశారు. మంచిపనులు చేసిన ఎమ్మెల్యేలకు మరో అవకాశం తప్పకుండా ఇస్తామని చెప్పారు. తమ పార్టీలో యువత, మహిళలు చురుకుగా పని చేస్తున్నారని, విద్యావంతులకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉందని అన్నారు.

>
మరిన్ని వార్తలు