అలోక్‌ వర్మపై అన్ని నిరాధార ఆరోపణలే!

12 Jan, 2019 14:26 IST|Sakshi
జస్టిస్‌ ఆర్‌ఎం లోధా, జస్టిస్‌ ఏకే పట్నాయక్‌

మాజీ చీఫ్‌ జస్టిస్, మాజీ సుప్రీం కోర్టు జడ్జీల స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) విచారణను సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ శనివారం మీడియా ముందు స్పష్టం చేశారు. కేవలం సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా చేసిన ఆరోపణ లపైనే అలోక్‌ వర్మపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ దర్యాప్తు జరిపి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిందని, ఆ నివేదికలోని అంశాలకు తనకు ఎంత మాత్రం సంబంధం లేదని పట్నాయక్‌ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను లిఖిత పూర్వకంగా సుప్రీం కోర్టుకు తెలియజేశానని చెప్పారు.

అంతేకాకుండా అలోక్‌ వర్మపై సీవీసీ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా కూడా అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని శుక్రవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించడం మరింత షాకింగ్‌ న్యూస్‌. అలోక్‌ వర్మపై వేటు గురించి ఆయన మాట్లాడుతూ సీబీఐపై రాజకీయ పెత్తనం కొనసాగినంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘సీబీఐ యజమాని మాటలను పలికే పంజరంలో రామ చిలక’ అంటూ 2013లో వ్యాఖ్యానించినదీ కూడా జస్టిస్‌ ఆర్‌ఎం లోధానే.

అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలను విశ్వసించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ సమర్పించిన నివేదిక ఆధారంగానే ఆయన్ని సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. విచారణను ఇటు సీవీసీ తరఫున అటు సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన జస్టిస్‌ లోధా, జస్టిస్‌ పట్నాయక్, ఇద్దరూ ఆధారాలు లేవని ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ నుంచి సుప్రీం కోర్టుకు, కోర్టు నుంచి ప్రధాని కార్యాలయానికి నివేదిక ఎలా వెళ్లిందన్నది కోటి రూకల ప్రశ్న. సీవీసీ కూడా పంజరంలో రామ చిలకేనా?

వర్మపై తీసుకున్న నిర్ణయాన్ని పునర్‌ సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టే ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీకి సూచించినప్పటికీ వర్మను తొలగిస్తూ ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకోవడం తొందరపాటేనని పట్నాయక్‌ అన్నారు. అన్ని అంశాలను అన్ని కోణాల నుంచి పరిశీలించి ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీవీసీ అభిప్రాయమే తుది అభిప్రాయం ఎందుకు అవుతుందని, విచారణను పర్యవేక్షించిన తన నివేదికను పరిగణలోకి తీసుకోవచ్చుగదా! అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సుప్రీం కోర్టుకు అందజేసిన పట్నాయక్‌ నివేదికను సుప్రీం కోర్టు ప్రధాని కార్యాలయానికి పంపి ఉండకపోవచ్చు. పంపినా పట్టించుకోక పోవచ్చు.

నరేంద్ర మోదీకి మంచి విశ్వాసపాత్రుడైన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు పెట్టి అరెస్ట్‌ చేయడానికి అలోక్‌ వర్మ ప్రయత్నించడం, అలోక్‌ వర్మపైనే రాకేశ్‌ అస్థాన ప్రత్యారోపణలు చేయడంతో సీబీఐలో ముసలం పుట్టడం, వారిద్దరిని బలవంతపు సెలవుపై మోదీ సర్కార్‌ పంపించడం, అలోక్‌ వర్మ తనపై చర్యను సుప్రీం కోర్టులో సవాల్‌ చేయడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే.

చదవండి: అలోక్‌ వర్మపై వేటు, సవాలక్ష ప్రశ్నలు

>
మరిన్ని వార్తలు