ఉల్లికి కళ్లెం..కేంద్రం కీలక నిర్ణయం

30 Sep, 2019 03:09 IST|Sakshi

నిల్వలపై పరిమితి

విదేశాలకు ఎగుమతులపై తక్షణమే నిషేధం..

రిటైలర్లకు 100 క్వింటాళ్లు, హోల్‌సేలర్లకు 500 క్వింటాళ్ల నిల్వకే అనుమతి

ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : వంటింట్లో మంటరేపుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగుమతులను తక్షణమే నిషేధించడంతోపాటు దేశంలోని వ్యాపా రుల వద్ద ఉండే ఉల్లి నిల్వలపై పరిమితులను విధించింది. రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు 500క్వింటాళ్లకు మించి ఉల్లిని నిల్వ చేసుకోరాదని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలి పింది. దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఉల్లి దిగుబడులు తగ్గడం, డిమాండ్‌ అనూహ్యంగా పెరగడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టి స్తున్న నేపథ్యంలో కేంద్రం ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

అక్రమ నిల్వలను అరికట్టేం దుకు, ధరలను అదుపులో ఉంచేందుకు అన్ని రాష్ట్రాలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం నిర్ణయంతో బంగ్లాదేశ్, శ్రీలంక లకు ఉల్లి ఎగుమతులు తక్షణమే నిలిచిపోతు న్నాయి. సాధారణంగా ఉల్లి నిల్వలపై పరిమి తులు విధించాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేస్తుండగా ఈసారి మాత్రం ఏకంగా కేంద్రమే నేరుగా రంగంలోకి దిగి అన్ని రాష్ట్రాల్లో ఉల్లి నిల్వలపై పరిమితి విధించడం గమనార్హం. మరోవైపు ఉల్లి ధరల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు 50 వేల టన్నుల బఫర్‌ స్టాక్‌ను కేంద్రం దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల బహిరంగ మార్కెట్‌లలో ఉల్లి ధర కిలోకు రూ. 60 నుంచి రూ. 80 మధ్య పలుకుతోంది.

పక్షం రోజులుగా ధర పైపైకి...
రాష్ట్రంలో ఇప్పటికే ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా కురిసన వర్షాలతో పంట దెబ్బతినడం, దీంతో దిగుమతులు తగ్గడం, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి మేలురకం ఉల్లి రాకపోవడంతో గత 15 రోజులుగా ఉల్లి ధర కిలోకు ఏకంగా రూ. 50 నుంచి రూ. 60 మధ్య పలుకుతోంది. ఢిల్లీ, హరియాణ, రాజస్తాన్, ముంబైలలో మరింత ఎగబాకి రూ. 80 దాకా చేరింది. చాలా చోట్ల ఉల్లికి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు అక్రమంగా ఉల్లిని నిల్వ చేస్తూ కృతిమ కొరత సృష్టిస్తున్నారు. 

దీంతో ధరలు దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉల్లి నిల్వలపై పరిమితులు విధించింది. గతంలో ఉల్లి ధరలు పెరిగిన సందర్భాల్లో లైసెన్స్‌ కలిగిన డీలర్లు కేటగిరి–ఏలో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన పట్టణాల్లో 75 క్వింటాళ్లు, కేటగిరి–బీలో అన్ని పట్టణ ప్రాంతాల్లో 40 క్వింటాళ్లు, కేటగిరి–సీలో గ్రామీణ ప్రాంతాల్లో 30 క్వింటాళ్ల వరకు ఉల్లిని నిల్వ చేసుకునేందుకు అనుతించింది. అంతకుమించి నిల్వ ఉంచే వారిపై నిత్యావసరాల ధరల నియంత్రణ చట్టం కింద ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టనుంది.

రాష్ట్రానికి పెరిగిన దిగుమతులు..
గడిచిన వారం రోజులుగా హైదరాబాద్‌లోని ప్రధాన మార్కెట్‌లకు ఉల్లి దిగుమతులు పెరిగాయి. ఈ నెల 21 వరకు మార్కెట్‌లో మేలు రకం ఉల్లి దిగుమతులు 3 వేల క్వింటాళ్ల నుంచి 5 వేల క్వింటాళ్ల మధ్య ఉండగా ఆ తర్వాత వారం నుంచి దిగుమతులు 6 వేల క్వింటాళ్ల నుంచి 8,500 క్వింటాళ్ల వరకు పెరిగాయి. ఇక రెండో రకం ఉల్లి సరఫరా సైతం 9 వేల క్వింటాళ్ల నుంచి 12 వేల క్వింటాళ్లకు పెరిగింది. దీంతో హోల్‌సేల్‌ ఉల్లి ధర రూ. 35 నుంచి రూ. 40 వరకు ఉండగా, బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. అయితే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఉత్తరాదిలో ఉల్లి వాడకం తగ్గుతుందని, ఫలితంగా రాష్ట్రానికి మరింత సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెటింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు