మహిళల ముసుగులో పాక్‌ ఏజెంట్లు

8 Nov, 2019 04:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో అపరిచితులతో స్నేహం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సైన్యం హెచ్చరించింది. భారత జవాన్లే లక్ష్యంగా పాక్‌ గూఢచార సంస్థ పనిచేస్తోందని, ఆధ్యాత్మిక బోధకులు, విదేశీ మహిళలమంటూ స్నేహహస్తం అందించే వారి విషయంలో, ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంచుకునే విషయంలో విచక్షణతో మెలగాలని సూచించింది. సున్నిత ప్రాంతాల్లో మెహరించిన సైనికులకు సంబంధించిన సమాచారం, ఉన్నతాధికారుల ఫోన్‌ నంబర్లు తెలుసుకునేందుకు తప్పుడు ప్రొఫైల్స్‌తో పాక్‌ ఏజెంట్లు భారత జవాన్లకు ఎరవేస్తున్నారని తెలిపింది.

రెండు, మూడేళ్ల క్రితం నాటి ఇటువంటి 150 ప్రొఫైల్స్‌ను ఇప్పటివరకు గుర్తించామని గత నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న కమాండింగ్‌ సెంటర్లు, డైరెక్టరేట్ల ద్వారా హెచ్చరించినట్లు సైన్యం తెలిపింది. సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్‌కు చెందిన మహిళా ఏజెంట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా అందించారనే ఆరోపణలపై జోథ్‌పూర్‌లో ఒక జవానును తాజాగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన జవాను విచిత్ర బెహ్రా ఒడిశాకు చెందిన వారు. విచారణలో బెహ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ మారు పేరుతో ఉన్న పాక్‌ ఏజెంటే  అని నిర్ధారణకు వచ్చారు.

మరిన్ని వార్తలు