ఉగ్రవాదంపై చర్యల్లో పాక్‌ విఫలం

8 Oct, 2019 04:36 IST|Sakshi

ఎఫ్‌ఏటీఎఫ్‌ తాజా నివేదిక

పాక్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టే చాన్స్‌

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునే చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మనీలాండరింగ్‌ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించే ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలన్నీ పాక్‌ తుంగలో తొక్కిందని మండిపడింది. హఫీజ్‌ సయీద్‌తో పాటుగా ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ముద్ర వేసిన ఇతర ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయాన్ని నిరోధించడంలో పాక్‌ విఫలమైందని పేర్కొంది. పాక్‌ తీసుకుంటున్న ఉగ్రవాద నిరోధక చర్యలు 40లో 31 ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చింది.  గత ఏడాదే ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. ఈ ఏడాది గ్రే లిస్ట్‌ నుంచి పాక్‌ను బ్లాక్‌ లిస్ట్‌కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశాలు పారిస్‌లో ఈ నెల 13 నుంచి జరగనున్నాయి.  

మా విమానం తిరిగిచ్చేయండి!
పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవలి అమెరికా పర్యటన గురించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా పర్యటనకు ఇమ్రాన్‌  సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు చెందిన ప్రైవేటు విమానంలో వెళ్లిన విషయం తెలిసిందే. తిరుగుప్రయాణంలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినందువల్ల ఇమ్రాన్, ఆయన బృందం  వేరే విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. అయితే, సాంకేతిక లోపం వల్ల కాదు.. సౌదీ యువరాజుకు ఇమ్రాన్‌పై కోపం వచ్చి, తన విమానాన్ని వెనక్కు పంపించమని ఆదేశించినందువల్లనే ఇమ్రాన్‌ వేరే విమానంలో న్యూయార్క్‌ నుంచి పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లారని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని ‘ది ఫ్రైడే టైమ్స్‌’ ఒక కథనంలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు