పాక్‌ నెంబర్‌తోనే ట్యాక్సీ బుక్‌ చేశారు!

3 Jan, 2016 15:13 IST|Sakshi
పాక్‌ నెంబర్‌తోనే ట్యాక్సీ బుక్‌ చేశారు!

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరం (ఎయిర్‌బేస్‌)పై దాడి చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన సంచలన వివరాలు వెలుగుచూస్తున్నాయి. తమను పంపిన పాకిస్థాన్‌ సూత్రధారులతో ఉగ్రవాదులు నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చారని, అంతేకాకుండా పాక్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి కాల్‌ చేసి ఉగ్రవాదుల కోసం ఓ ట్యాక్సీ కూడా బుక్‌ చేశారని తాజాగా తేలింది.

భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు మొదట టయోటా ఇన్నోవా కారులో ప్రయాణించారు. ఈ కారు డ్రైవర్‌కు పాక్‌లోని సూత్రధారులు ఫోన్‌ చేసి వాహనం బుక్‌ చేసుకున్నారు. అయితే డ్రైవర్‌కు మొదటినుంచి పాక్‌ స్మగ్లర్లు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? లేక అది పాక్‌ మొబైల్‌ నెంబర్‌ అని తెలియకపోవడం వల్ల అతను ఉగ్రవాదులను తన వాహనంలో ఎక్కించుకున్నాడా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. పఠాన్‌కోట్‌లోని ఓ కీలక ప్రదేశం వరకు తమను తీసుకెళ్లి దింపాలని ఉగ్రవాదులు డ్రైవర్‌ను కోరారు. అయితే మధ్యలోనే ఇన్నోవా వాహనం పాడవ్వడంతో ఉగ్రవాదులు ఎస్పీకి చెందిన మహేంద్ర ఎస్‌యూవీ వాహనాన్ని హైజాక్‌ చేశారు.

అందులో ఉన్న ఎస్పీని, ఆయన వంటవాణ్ని చితకబాది వదిలేశారు. వారితోపాటు ఉన్న మరో నగల వ్యాపారిని బందీగా పట్టుకొని కొంతదూరం వెళ్లాక అతన్ని గొంతు కోసి వదిలేశారు. ఈ క్రమంలోనే వారి మొబైల్ ఫోన్‌ను దొంగలించిన ఉగ్రవాదులు దానినుంచి మూడుసార్లు పాక్‌లోని తమ సూత్రధారులకు ఫోన్ చేశారు. వారు ఫోన్ చేసిన ఈ నెంబర్‌ నుంచే అంతకుముందు ఇన్నోవా డ్రైవర్‌కు కాల్‌ వచ్చింది. ఆ తర్వాత ఒక ఉగ్రవాది తన కుటుంబానికి ఫోన్ చేసి తాను ఆత్మాహుతి దాడిలో పాల్గొనబోతున్నట్టు చెప్పాడు. ఈ వివరాలన్నీ క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకొస్తున్న భద్రతా సంస్థలు ఉగ్రవాదుల వెనుక ఉన్న కీలక సూత్రధారులను గురించి కచ్చితమైన ఆధారాలు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు