కొట్టేసిన పర్సులు @ పోస్ట్‌బాక్స్‌

16 Oct, 2018 04:18 IST|Sakshi

డబ్బు తీసుకొని పోస్టు బాక్సుల్లో పడేస్తున్న జేబు దొంగలు

పర్సుల యజమానులకు చేరవేస్తున్న చెన్నై పోస్టల్‌ శాఖ

చెన్నై: జేబు దొంగలు కొత్త పద్ధతి కనుగొన్నారు. కొట్టేసిన పర్సులను తెలివిగా వదిలించుకుంటున్నారు. ఐడీ కార్డులున్న పర్సులను వదిలించుకునేందుకు పోస్టు బాక్సులను స్వర్గధామంగా వాడుకుంటున్నారని చెన్నైలోని పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ చెబుతోంది. గత ఆరు నెలలుగా ఇలాంటివి చాలా కేసులు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. పర్సుల నుంచి డబ్బులు తీసుకున్నాక వాటిని పోస్టు బాక్సుల్లో వేస్తున్నారని, అందులో ఐడీ కార్డులను మాత్రం ముట్టుకోకుండా అలాగే ఉంచేస్తున్నారని చెన్నై పోస్టల్‌ అధికారి ఒకరు తెలిపారు.

గత ఆరు నెలల్లో చెన్నై సిటీ కార్పొరేషన్‌ పరిధిలో దాదాపు 70 కేసులు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. పర్సుల్లో ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సుల వంటివి ఉంటున్నట్లు తమ సిబ్బంది గుర్తించిందని చెప్పారు. అందులో ఉన్న ఐడీ కార్డులు సరైన అడ్రస్‌కు చేరుకునేలా తమ సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అలా చేయడం వల్ల తమకేం ఆదాయం రాదని, అయినా ఇదో సేవలాగా తాము ఈ పనిచేస్తున్నామని వివరించారు. ఐడీ కార్డుల్లో ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలుంటే వారిని సంప్రదించి సంబంధిత పోస్టాఫీసుల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు