ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ప్రధాని

26 Feb, 2020 14:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏపై ఢిల్లీలో అల్లర్లు తీవ్రరూపం దాల్చి మృతుల సంఖ్య బుధవారం 20కి చేరడంతో పాటు క్షతగాత్రుల సంఖ్య 150కి పెరిగింది. అల్లర్లను తక్షణమే నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించామని, శాంతి..సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ ప్రజలు శాంతి, సోదరభావాలను సంయమనంతో అన్ని సమయాల్లో కొనసాగించాలని అభ్యర్ధిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ఢిల్లీలో సత్వరమే శాంతి, సాధారణ పరిస్ధితులు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల వెనుక నజీర్‌, చెను గ్యాంగ్‌లకు చెందిన 12 మంది ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. గత మూడురోజులుగా దుండగులు 600 రౌండ్ల బుల్లెట్లను కాల్చినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని ఖజౌరీ ఖాస్‌లో అ‍ల్లరి మూకలు ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్‌ అంకిత్‌ శర్మను బలితీసుకున్నాయని పోలీసులు తెలిపారు. కాగా ఢిల్లీలో చెలరేగిన హింసను అదుపు చేయడంలో పోలీస్‌ యంత్రాంగం విఫలమైందని ఆరోపించిన కాంగ్రెస్‌ పార్టీ హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.

చదవండి : సీఏఏపై వెనక్కి వెళ్లం

మరిన్ని వార్తలు