మా ఆయన పాస్ పోర్టు కాపీ ఇవ్వండి: మోదీ భార్య

11 Feb, 2016 10:48 IST|Sakshi
మా ఆయన పాస్ పోర్టు కాపీ ఇవ్వండి: మోదీ భార్య

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పాస్ పోర్టులోని వివరాలు తెలపాల్సిందిగా ఆయన భార్య జశోదా బెన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. తన సోదరుడు అశోక్ మోదీ, మరో బంధువుతో కలసి ఆటోలో అహ్మదాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయానికి  (ఆర్పీఓ) వచ్చిన జశోదా బెన్ మోదీ పాస్ పోర్టు కాపీ ఇవ్వాల్సిందిగా కోరారు.

విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులను కలిసేందుకోసం జశోదా బెన్ పాస్ పోర్టుకు దరఖాస్తు చేయగా.. మ్యారేజ్ సర్టిఫికేట్ పొందుపరచలేదన్న కారణంతో గత నవంబర్లో అధికారులు ఆమెకు పాస్ పోర్టు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆమె మోదీ పాస్ పోర్టులోని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మోదీ తీసుకున్న పాస్ పోర్టు, రెన్యువల్ చేసిన పాస్ పోర్టుల కాపీలను ఇవ్వాల్సిందిగా ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం అధికారులను కోరారు. ఆర్పీఓలో 15 నిమిషాలు ఉన్న జశోదా బెన్.. వ్యక్తిగత పనిమీద వచ్చానని చెప్పారు. అయితే వివరాలు వెల్లడించలేదు. జశోద్ బెన్ దరఖాస్తును పరిశీలిస్తున్నామని, 30 రోజుల్లోగా సమాధానమిస్తామని ఆర్పీఓ అధికారి జెడ్ ఏ ఖాన్ చెప్పారు. జశోదా బెన్ తన భద్రతకు సంబంధించి గతంలో ఓసారి సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ భార్యగా తనకు కల్పిస్తున్న భద్రత గురించి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరారు. అయితే భద్రత కారణాల వల్ల సమాచారం ఇవ్వలేమని, ఈ విషయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదంటూ మెహ్సనా జిల్లా ఎస్పీ అప్పట్లో జశోద్ బెన్కు వివరించారు. మోదీ, జశోదా బెన్ వేర్వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు