షింజో అబేకు ప్రధాని మోదీ సాదర స్వాగతం

13 Sep, 2017 16:06 IST|Sakshi

అహ్మదాబాద్‌ : జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే బుధవారం భారత్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. షింజో అబే సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో గుజరాత్‌ విచ్చేశారు. సైనిక వందనం స్వీకరించిన అనంతరం ప్ర‌ధాని మోదీతో క‌లిసి రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీతో కలిసి ఆయన స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంతో పాటు సిద్ది స‌య్య‌ద్ మసీదును సందర్శించనున్నారు.

అలాగే  ఇండో-జపాన్‌ వార్షిక సదస్సు సహా పలు కార్యక్రమాల్లో ఇద్దరు ప్రధానులు పాల్గొంటారు.  అలాగే గురువారం అహ్మ‌దాబాద్ - ముంబై మ‌ధ్య తొలి హైస్పీడ్ రైలు ప‌నుల ప్రారంభ కార్య‌క్ర‌మంలో షింజో అబే పాల్గొంటారు. జపాన్‌ ప్రధాని రాక సందర్భంగా అహ్మ‌దాబాద్ స‌ర్వాంగ సుంద‌రంగా త‌యారైంది. మరోవైపు భద్రతా ఏర్పాట్ల కోసం నగరంలోని పోలీస్‌ సిబ్బందితో పాటు ఇతర ప్రాంతాల పోలీసులు కూడా మోహరించారు. రాష్ట్ర రిజర్వ్‌ పోలీస్‌కు చెందిన 12 కంపెనీల బలగాలతో పాటు బాంబ్‌ స్క్వాడ్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు, ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం పహరా కాస్తున్నాయి.