మోదీ హామీలపైనే ప్రజలకు భరోసా | Sakshi
Sakshi News home page

మోదీ హామీలపైనే ప్రజలకు భరోసా

Published Sun, Dec 10 2023 5:39 AM

PM Narendra Modi interacts with beneficiaries of Viksit Bharat Sankalp Yatra - Sakshi

న్యూఢిల్లీ: తప్పుడు హామీలతో విపక్షాలు సాధించేదేమీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కానీ ఈ వాస్తవాన్ని అవి ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదన్నారు. బీజేపీ ఇచి్చన, ఇస్తున్న ‘మోదీ హామీలు’ దేశవ్యాప్తంగా ప్రజల్లో మార్మోగుతున్నాయని చెప్పారు. ‘‘వాటిని వాళ్లు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలే ఇందుకు చక్కని రుజువు’’ అని ప్రధాని వివరించారు.

కేంద్ర పథకాలు ప్రజలందరికీ చేరేలా చూసేందుకు చేపట్టిన వికసిత్‌ సంకల్ప్‌ యాత్ర లబి్ధదారులతో శనివారం ఆయన ముచ్చటించారు. ఎన్నికల్లో నెగ్గడానికి ముందు ప్రజల హృదయాలను గెలుచుకోవడం చాలా అవసమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఏ పారీ్టకైనా ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేయడం తెలివైన పని కాదని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

‘‘కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని, భావోద్వేగపూరిత బంధాన్ని ఏర్పాటు చేయగలిగాం. ప్రజలు తమదిగా భావిస్తున్న ప్రభుత్వం మాది. మోదీ ప్రతి ఒక్కరికీ సేవకుడు. పేదలను పూజిస్తాడు. వారి క్షేమం కోసం తపిస్తాడు. ప్రతి పేదా, తల్లి, చెల్లి, రైతు, యువతి, యువకుడు నాకు వీఐపీయే’’ వ్యాఖ్యానించారు. ‘‘విపక్షాలను ప్రజలు నమ్మకపోవడానికి అవి ఇస్తున్న తప్పుడు హామీలు, ప్రకటనలే కారణం.

దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వాళ్లు ప్రజా క్షేమాన్ని పట్టించుకుని ఉంటే వారికి నేడు ఇంతటి నిరాదరణ ఉండేదే కాదు. ఎన్నికల్లో గెలిచేది ప్రజాక్షేత్రంలోనే తప్ప సోషల్‌ మీడియాలో కాదు’ అని విపక్షాలకు చురకలు అంటించారు. పక్కా ఇల్లు, తాగునీటి నల్లా, మరుగుదొడ్డి, ఉచిత వైద్యం, రేషన్, గ్యాస్, విద్యుత్, బ్యాంకు ఖాతాల వంటి సదుపాయాలు దేశ ప్రజలందరికీ అందుతున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు.

పీటీఐ ప్రధాన కార్యాలయం సందర్శన
ఢిల్లీలో ఉన్న ప్రముఖ వార్తాసంస్థ ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా(పీటీఐ) ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ శనివారం సందర్శించారు. కొత్తగా ప్రారంభించిన వీడియో సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఒక వార్తసంస్థ కార్యాలయానికి మోదీ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా అక్కడి సీనియర్‌ ఎడిటోరియల్, ఎగ్జిక్యూటివ్‌ విభాగాల సిబ్బందితో మాట్లాడారు. మీడియాకు ఎదురయ్యే సవాళ్లు, మీడియాలో అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement