మెరుగైన భవిష్యత్తుకే!

7 Dec, 2019 04:31 IST|Sakshi
పుణె విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలుకుతున్న సీఎం ఉద్ధవ్‌

ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించడంపై ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: మెరుగైన భవిష్యత్తును కల్పించే ఉద్దేశంతోనే విదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న వారికి భారత పౌరసత్వం కల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు, హింస ఎదుర్కొన్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే బిల్లుకు  కేబినెట్‌ ఆమోదం తెలిపిన తరువాత తొలిసారి ప్రధాని ఈ విధంగా స్పందించారు. భరతమాతపై విశ్వాసమున్న, విదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న వారికి మెరుగైన భవిష్యత్తును హామీ ఇస్తూ భారత్‌కు స్వాగతం పలుకుతున్నాం’ అని హిందూస్తాన్‌ టైమ్స్‌ నాయకత్వ సదస్సులో శుక్రవారం మోదీ వ్యాఖ్యానించారు.

అయోధ్య తీర్పుపై స్పందిస్తూ.. ‘తీర్పు వల్ల సమాజంలో అశాంతి నెలకొనే అవకాశముందని తీర్పునకు ముందు చాలామంది అనుమానించారు. కానీ వారి అనుమానాలు తప్పని ప్రజలు నిరూపించారు’ అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై.. ‘అది రాజకీయంగా కష్టమైన చర్యగా కనిపించవచ్చు, కానీ ఆ నిర్ణయం జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్‌ ప్రజల అభివృద్ధికి ఒక ఆశాకిరణంగా మారింది’ అని స్పందించారు.   

మారిషస్‌ ప్రధానితో భేటీ
భద్రమైన, స్థిరమైన, ప్రగతిశీల మారిషస్‌ నిర్మాణానికి తమ సహకారం ఎల్ల వేళలా ఉంటుందని భారత్‌ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శుక్రవారం మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగనాధ్‌తో భేటీ అయ్యారు. మారిషస్‌ పార్లమెంట్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రవింద్‌  విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, మారిషస్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. తమ దేశంలోని అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారత్‌ భాగస్వామ్యం ఉందని మారిషస్‌ ప్రధాని గుర్తు చేశారు.

మోదీకి ఉద్ధవ్‌ స్వాగతం
పుణె: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ), ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(ఐజీపీ)ల జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మోదీకి ఉద్ధవ్‌ ఠాక్రే పుణె విమానాశ్రయంలో స్వాగతం పలికారు. గవర్నర్‌ కోశ్యారీ, మాజీ సీఎం ఫడ్నవీస్‌ కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు