ఆస్పత్రి యాజమాన్యల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి

22 Jun, 2020 15:04 IST|Sakshi

లక్నో: ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్షానికి ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నొప్పులు రావడంతో గర్భిణీని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే, ఆస్పత్రి యాజమాన్యాలు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించాయి. ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిది. అలా దాదాపు 15గంటలపాటు అంబులెన్స్‌లోనే నరకయాతన అనుభవించిన ఆ మహిళ చివరకు మరణించింది. ఈ విషాదకర సంఘటన వివరాలు..

గౌతమ్‌బుద్ధనగర్ జిల్లాలోని కోడా కాలనీలో నివాసముంటున్న విజేందర్ సింగ్, నీలమ్ భార్యాభర్తలు. ఎనిమిది నెలల గర్భిణీ అయిన నీలమ్‌(30)కు అనుకోకుండా నొప్పులు రావడంతో.. భర్త విజేందర్ సింగ్ ఆమెను అంబులెన్స్‌లో మొదట ఈఎస్‌‌ఐ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే నీలమ్‌ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఈఎస్‌ఐ వైద్యులు సరిపడా బెడ్స్ లేవని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దాంతో సెక్టార్ 30లోని చైల్డ్ పీజీఐ ఆస్పత్రికి, అక్కడి నుంచి షర్దా, జిమ్స్(గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్)లకు వెళ్లారు. కానీ ఎవరు వారిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రులైన జేయ్‌పీ, ఫోర్టీస్, మ్యాక్స్ ఇన్ వైశాలికి వెళ్లామని.. వారూ నిరాకరించారని విజేందరన్‌ తెలిపాడు. ఇలా మొత్తం 15 గంటలపాటు 8 ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరకు నొప్పులు భరించలేక నీలమ్ అంబులెన్స్‌లోనే మరణించింది. 

విజేందర్‌ మాట్లాడుతూ.. ఎనిమిది ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని.. వైద్యులు నిర్లక్ష్యం వల్లే తన భార్య మరణించిందని కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్‌వై విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఇలాంటి సంఘటనే ఒకటి ఈ జిల్లాలో చోటు చేసుకుంది. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో మే 25న పుట్టిన శిశువు మరణించాడు.

మరిన్ని వార్తలు