‘పుల్వామా’ మోదీకి కలిసొచ్చే అంశం!

25 Feb, 2019 19:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, విద్యార్థులు, రైతుల్లో, కొంత మేరకు మీడియాలో కూడా అసంతృప్తి ఉంది. అసహనమూ ఉంది. అయితే ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలన్న కోపం, కసి లేవు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో మహా కూటమని ఏర్పాటు చేసినా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ని ఓడించే అవకాశం ఉండకపోవచ్చు. పలు పార్టీల కూటమిని పూర్తిగా నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. నేడు కూడిన పార్టీలు రేపు విడిపోవచ్చన్నది వారి అనభవ పూర్వక విశ్వాసం. జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్రాల స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పొత్తులు పెట్టుకున్నట్లయితే ఆ పార్టీని ఓడించే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది.

కశ్మీర్‌లోని పుల్వామా సంఘటన బీజేపీ బలపడేందుకు ఆస్కారం ఇస్తోంది. పాకిస్థాన్‌ మీద బదలా, ప్రతికారం తీసుకోవాలని మెజారిటీ భారతీయులు కోరుకుంటున్న మాట వాస్తవం. పరిమితంగానైనా పుల్వామా ఘటనపై ప్రతీకారం తీర్చుకుంటే అది కచ్చితంగా మోదీకి లాభిస్తుంది. మోదీ కూడా ఆ దిశగా ఆలోచిస్తు ఉండవచ్చు. ఇదివరకటిలా అంటే, 2004లో ఉన్నట్లు ఓటర్ల పరిస్థితి నేడు లేదు. ఆనాడు ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు వరకు మెజారిటీ ఓటరు ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకునే వారు కాదు. ఇప్పుడు రెండు, మూడు రోజుల కాదు, రెండు, మూడు నెలల ముందే ఏ పార్టీకి ఓటు వేయాలో ఓ నిర్ణయానికి  వస్తున్నారు. ఈ కొత్త వైఖరి 2009 పార్లమెంట్‌ ఎన్నికల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. ముందుగానే ఓ నిర్ణయానికి వస్తున్న ఓటర్ల శాతం 50 శాతానికిపైనే ఉంటోంది. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకునే ఒటర్ల సంఖ్య 45–40 శాతం నుంచి 25–20 శాతానికి పడే పోవడమే అందుకు సాక్ష్యం. ఈ కారణంతోనే గెలుపు, ఓటముల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది.

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుకోలు స్కామ్‌ గురించి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పదే పదే మాట్లాడుతున్నప్పటికీ దాని ప్రభావం ఓటర్లపై అంతగా ఉండదు. మధ్యతగరతి ఎగువ శ్రేణి నుంచి అవినీతి అంశాన్ని అంతగా పట్టించుకోరు. అంతకన్నా దిగువ స్థాయి ప్రజలకు అవినీతి అంశం పడుతుంది. కానీ నిత్యావసర సరకుల ధరలపై ప్రభావం చూపే లేదా తమ బతుకులను మరింత దుర్భరం చేసే అవినీతిని పట్టించుకుంటారుగానీ రఫేల్‌ లాంటి అవినీతి గురించి పట్టించుకోరు. మోదీకి సొంత కుటుంబం లేకపోవడం వల్ల కూడా ఆయన అవినీతికి పాల్పడ్డారంటే జనం అంత సులువుగా నమ్మరు. ఒంటరి వాడు, ఆయన అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని భావిస్తారు. నరేంద్ర మోదీ ఆధిపత్య ధోరణి గురించి ప్రస్తావిస్తూ, దాన్ని మేధావులే అర్థం చేసుకుంటారు. దాన్ని సామాన్యులు బలమైన నాయకుడి మనస్తత్వంగా భావిస్తారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో వచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ గతంలో ఆయన ప్రధాన మంత్రిగా కోరుకున్నవారు 18 నుంచి 20 శాతం మంది ఉండగా, నేడు వారి సంఖ్య 27–28 శాతానికి పెరిగింది. ఎన్నికల నాటికి మరి కొంత పెరగవచ్చు.’ (ఢిల్లీలోని ‘సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌’ డైరెక్టర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సంజయ్‌ కుమార్‌ ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాల సారాంశం)

మరిన్ని వార్తలు