నా ప్రమాణం తర్వాత మాట్లాడతా

18 Mar, 2020 03:01 IST|Sakshi

మాజీ సీజేఐ రంజన్‌ గొగోయ్‌

రాజ్యసభకు నామినేట్‌ చేయడంపై దుమారం

న్యూఢిల్లీ/గువాహటి: రాజ్యసభ సభ్యుడిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్యసభ నామినేషన్‌ గురించి మాట్లాడతానని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ అన్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్‌ అవడంపై పలు పార్టీలు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈమేరకు స్పందించారు. మంగళవారం గువాహటిలోని తన నివాసంలో గొగోయ్‌ విలేకరులతో మాట్లాడుతూ తాను బుధవారం ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. ‘ముందు నన్ను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయనివ్వండి. తర్వాత ఈ నామినేషన్‌ను ఎందుకు అంగీకరించానో వివరంగా చెప్తాను’అని అన్నారు. రాజ్యసభ నామినేటెడ్‌ సభ్యుల్లో ఒకరు పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో రంజన్‌గొగోయ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో పలు రాజకీయ పార్టీలు గొగోయ్‌ నామినేషన్‌పై దుమారం రేపాయి. కాగా, రంజన్‌ గొగోయ్‌ 13 నెలల పాటు సీజేఐగా తన సేవలందించిన అనంతరం గతేడాది నవంబర్‌లో పదవీ విరమణ పొందారు. తన నామినేషన్‌పై వచ్చిన విమర్శలపై గొగోయ్‌ స్పందిస్తూ ‘దేశ అభివృద్ధి కోసం శాసన, న్యాయ వ్యవస్థలు ఏదో ఒక సమయంలో కలిసి పనిచేయాల్సిన అవసరముందనే నమ్మకంతోనే నేను రాజ్యసభ నామినేషన్‌ను అంగీకరించాను’అని తెలిపారు. కాగా, గొగోయ్‌ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ చేయడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. ‘గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేసే ముందు ప్రధాని మోదీ.. దివంగత, మాజీ న్యాయ మంత్రి అరుణ్‌ జైట్లీ సలహాను పరిగణలోకి తీసుకున్నారా?’అని కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

న్యాయ స్వతంత్రతను అణగదొక్కడమే 
రంజన్‌ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేయడం ఒక పనికి మాలిన చర్య అని, ఇది న్యాయ స్వతంత్రతను అణగదొక్కేలా ఉందని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. న్యాయ అధికారులు, ఉన్నత ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన వారు పదవీ విరమణ పొందిన తర్వాత లాభం పొందే ఎలాంటి పోస్టులోకి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని సీపీఐ డిమాండ్‌చేసింది.  

న్యాయవ్యవస్థ, స్వతంత్రతను తుంగలో తొక్కారు 
నిష్పక్షపాత న్యాయ వ్యవస్థ, స్వతంత్రత వంటి ఉన్నత విలువలను రంజన్‌ గొగోయ్‌ తుంగలో తొక్కారని మాజీ సుప్రీంకోర్టు జడ్జి కురియన్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఒక సాధారణ పౌరుడికి ఉన్న నమ్మకాన్ని రాజ్యసభ నామినేషన్‌ను అంగీకరించడం ద్వారా గొగోయ్‌ వమ్ము చేశారని ఆరోపించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు