బాబ్రీ విధ్వంసం: విచారణ ఆపండి

30 May, 2020 20:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను మూసివేస్తే మంచిదని ‘రామ జన్మభూమి’ కేసులో ప్రధాన పిటిషనర్‌ అయిన ఇక్బాల్‌ అన్సారీ లక్నో సీబీఐ కోర్టుని కోరారు. అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తుది తీర్పును వెలువరించిందని, ఈ సమయంలో మళ్లీ బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టడం అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశం కాబట్టి సీబీఐ తీర్పు దేశంలో మరోసారి రాజకీయ వైరుధ్యాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా బాబ్రీ మసీదు విధ్వంసంపై బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, ఉమా భారతి, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌ ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు)

ఈ కేసుకు సంబంధించి ఆగస్ట్‌ 31లోపు పూర్తి చేయాలని విచారణ పూర్తి చేసి తుది తీర్పును వెలువరించాలని ఇటీవల దేశ అత్యుతున్న న్యాయస్థాం లక్నో సీబీఐ కోర్టుకు డెడ్‌లైన్‌ విధించింది. ఈ నేపథ్యంలో జూన్‌ 4న వీరంతా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరుకానున్నారు. దీనిపై శనివారం మీడియాతో మాట్లాడిన ఇక్బాల్‌ అన్సారీ.. వివాదం ఇప్పటికే సమసిపోయిన నేపథ్యంలో విచారణను ఆపేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పుపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు. బాబ్రీ కూల్చివేత అంశం రాజకీయ అంశాలతో ముడిపడి  ఉందని, ఇలాంటి సున్నితమైన కేసును సీబీఐ ఇక మూసివేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.

కాగా అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌  తీర్పును వెలువరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘1992 డిసెంబర్‌ 6న కరసేవకులు వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్‌ మూలాలను దెబ్బతీయడానికి ‍ప్రయత్నించారు. ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది’ అంటూ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణను ముగించాలని సుప్రీంకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించింది.

మరిన్ని వార్తలు