ప్యాసింజర్‌ పేరుతో డ్రైవర్‌ జల్సా...!!

23 Jul, 2018 10:33 IST|Sakshi

సాక్షి, ముంబై : ఆన్‌లైన్‌ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ‘ఉబెర్‌’ లో క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ఓ ప్రయాణికుడికి ఊహించని పరిణామం ఎదురైంది. క్యాబ్‌లో ఎక్కించుకోకుండానే తన పేరిట నగరమంతా డ్రైవర్‌ చక్కర్లు కొట్టడంతో కంగుతినడం అతడి వంతైంది. అసలేం జరిగిందంటే.. ముంబైకి చెందిన ప్రేషిత్‌ దియోరుఖర్‌ అనే వ్యక్తి జూలై 19న ఉబెర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. తాను ఉన్న చోటుకి రావాల్సిందిగా సంబంధిత క్యాబ్‌ డ్రైవర్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. కానీ ఎంతసేపైనా అతను రాకపోవడంతో ప్రేషిత్‌ ఫోన్‌ చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా అతడు ఫోన్‌ ఎత్తకపోవడంతో విషయాన్ని గ్రహించిన ప్రేషిత్‌.. ట్విటర్‌ ద్వారా తన సమస్యను ఉబెర్‌ టీమ్‌కు తెలియజేశాడు. కానీ అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తన పేరిట డ్రైవర్‌ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో లొకేషన్‌ షేర్‌ చేస్తూ వరుసగా ట్వీట్లు చేశాడు.

‘క్యాబ్‌లో శవం ఉంటే ఎలా..?’
‘మలాద్‌ వెస్ట్‌ నుంచి నన్ను పికప్‌ చేసుకున్నాడు, ఇప్పుడతను ఉత్తర ముంబైకి చేరుకున్నాడు. ఒకవేళ ఆ క్యాబ్‌లో శవం ఉంటే ఎలా..? దాని వల్ల ఎవరికి సమస్య..?  857.43 రూపాయలు చెల్లించాలట. జల్సా అతడిది బిల్లు మాత్రం నాది’  ​అంటూ వరుసగా ట్వీట్లు చేయడంతో ఎట్టకేలకు ఉబెర్‌ టీమ్‌ స్పందించింది. ‘మీ డబ్బులు తిరిగి చెల్లిస్తాం. డ్రైవర్‌కు నోటీసు కూడా జారీ చేశాం’ అని సమాధానమిచ్చింది. నా సమయం వృధా చేసి కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదంటూ ప్రేషిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా నిమిషాల్లోనే ప్రేషిత్‌ ట్వీట్లు వైరల్‌ కావడంతో మరికొంత మంది ప్రయాణికులు కూడా క్యాబ్‌ డ్రైవర్ల వల్ల తమకు ఎదురైన చేదు అనుభవాల్ని పంచుకున్నారు.

మరిన్ని వార్తలు