ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సదాశివం?

15 Jul, 2017 01:17 IST|Sakshi
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సదాశివం?

నేడో, రేపో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్‌ గడువు (జూలై 18) సమీపిస్తున్న కొద్దీ అధికార ఎన్డీయే తరపున బరిలో దిగే అభ్యర్థిపై ఉత్సుకత పెరుగుతోంది. బీజేపీ అధిష్టానం ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అయితే అభ్యర్థి ఎవరై ఉండొచ్చనే అంశంపై స్పష్టత రాకపోయినా.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత కేరళ గవర్నర్‌ పి. సదాశివంకు అవకాశం లభించొచ్చని పార్టీలోని విశ్వసనీయవర్గాల సమాచారం.

2014లో తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన సదాశివంను ఆ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది.  ఓ సీజేఐ గవర్నర్‌గా నియమి తులవటం ఇదే తొలిసారి. అటు, ఓబీసీలకు ఉపరాష్ట్రపతి పగ్గాలు అప్పగించాలని భావిస్తున్న తరుణంలో గౌండర్‌ వర్గానికి చెందిన సదాశివంకు ఎక్కువ అవశాకాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య, యూపీ గవర్నర్‌ రాంనాయక్, గుజరాత్‌ మాజీ సీఎం ఆనందీబెన్, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుల పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ వీరికి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ప్రధాని మోదీ, అమిత్‌షా మనసులో ఏముందో నేతలకు అర్థం కావటం లేదని.. ఎవరిని తెరపైకి తెస్తారనేది చివరి నిమిషం వరకు స్పష్టంగా చెప్పలేమని పార్టీ నేతలంటున్నారు. అయితే పార్టీ బలంగా లేని దక్షిణ భారతంలో పాగా వేసేందుకు ఈ ప్రాంతానికి  చెందిన వ్యక్తి ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయొచ్చని సమాచారం. మరోవైపు, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి జూలై 23న పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో  జరిగే కార్యక్రమంలో వీడ్కోలు తెలపనున్నారు.

>
మరిన్ని వార్తలు