రాహుల్ గాంధీ ఎందుకు దాక్కుంటున్నారు?

20 Apr, 2017 16:44 IST|Sakshi
రాహుల్ గాంధీ ఎందుకు దాక్కుంటున్నారు?

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ కార్యకర్తల నుంచి ఎందుకు దాక్కుంటున్నారు? ఈ ప్రశ్న అడిగింది ఎవరో ప్రతిపక్ష నాయకులు కాదు.. ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్. కేంద్ర మాజీమంత్రి అజయ్ మాకెన్ తదితరులపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులను అజయ్ మాకెన్ తిడుతున్నారని, బెదిరిస్తున్నారని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రశ్నలు అడుగుతారన్న భయంతో ఆయన భయపడి దాక్కుంటున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడానికి రాహుల్ గాంధీ 'అన్‌ ఫిట్' అని చాలామంది అత్యంత సీనియర్ నాయకులు భావిస్తున్నారని చెప్పారు. అయితే వాళ్ల పేర్లు మాత్రం ఆమె బయటపెట్టలేదు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ, యూత్ కాంగ్రెస్ మాజీ నాయకుడు అమిత్ మాలిక్ ఇప్పటికే పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోగా.. ఇప్పుడు బర్ఖా శుక్లా సింగ్ వంతు అయింది. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇలా వరుసపెట్టి పెద్ద నాయకులంతా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతుండటంతో ఇక కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

మార్చి 28న నవరాత్రుల సందర్భంగా తాను, పలువురు మహిళా కార్యకర్తలు ఉపవాసంతో ఉండి రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించామని, కానీ ఆయన నవరాత్రులను పట్టించుకోరంటూ తమను ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా అక్కడివాళ్లు చెప్పారని బర్ఖా శుక్లా సింగ్ చెప్పారు. పార్టీ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ తన పట్ల, ఇతర మహిళా నాయకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, అదే విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లినా తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని ఆమె వాపోయారు. ప్రియాంకా గాంధీ గురించి వినయ్ కతియార్ ఏమైనా అంటే వెంటనే దాన్ని తాము ఖండించాలని రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చేవని, కానీ తాము అజయ్ మాకెన్ తమను తిడుతున్నారని చెప్పినా ఆ విషయాన్ని మాకెన్‌తోనే తేల్చుకోవాలని చెప్పేవాళ్లని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసమే మహిళా సాధికారతను వాడుకున్నారని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు