దొంగను పట్టుకునే ప్రయత్నంలో మహిళా టీచర్ మృతి

5 Jul, 2016 21:38 IST|Sakshi
దొంగను పట్టుకునే ప్రయత్నంలో మహిళా టీచర్ మృతి

పారిపోతూ వృద్దుడిని బలితీసుకున్న దొంగలు
టీచర్ వెంట ఉన్న యువతికి తీవ్రగాయాలు


చెన్నై: నెల రోజుల కష్టార్జితమైన జీతం సొమ్మును దోచుకెళుతున్న దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఓ మహిళా టీచర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో వృద్ధుడు సైతం ప్రాణాలు కోల్పోగా, మరో యువతి పరిస్థితి విషమంగా మారింది. సోమవారం రాత్రి చెన్నైలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై, పట్టినపాక్కం శ్రీనివాసపురానికి చెందిన నందిని (24) నీలాంగరైలోని ప్రైవేటు పాఠశాలలో టీచరుగా పనిచేస్తోంది. తన జీతం డబ్బులు డ్రా చేసుకునేందుకు సోమవారం రాత్రి  తన అత్తకూతురు నజ్జూను తోడుగా తీసుకుని ఏటీఎంకు వెళ్లింది. రూ.25 వేలు డ్రా చేసి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని ఇంటికి వెళుతుండగా బైక్‌ పై దూసుకొచ్చిన ఇద్దరు యువకులు నజ్జూ చేతిలోని హాండ్‌బ్యాగ్‌ను లాక్కుని పారిపోయారు.

వేగంగా పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు అతివేగంతో వెంటపడిన నందిని తన స్కూటీని అదుపుచేయలేక కిందపడ్డారు. ఆమె తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నజ్జూకు తీవ్రగాయాలయ్యాయి. పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు ప్రజలు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగలు తమ బైక్‌తో శేఖర్ అనే వృద్ధుడిని ఢీకొట్టడంతో అతనూ అక్కడికక్కడే చనిపోయాడు. దొంగలు బైక్ పై నుంచి పడిపోవడంతో స్థానికులు దొంగల్లో ఒకడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా, మరో దొంగ చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు