‘రాంబెల్లి నేవల్‌ బేస్‌ నిర్వాసితులకు సాయం చేశాం’

2 Apr, 2018 19:58 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ:  విశాఖపట్నం జిల్లా రాంబెల్లి మండలంలో ఏర్పాటు చేసిన నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ (ఏఓబీ) కారణంగా భూములు కోల్పొయిన నిర్వాసితులైన కుటుంబాలకు నష్టపరిహారంతోపాటు, పునరావాసానికి సకల చర్యలను పూర్తి చేసినట్లు రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాంబిల్లి మండలంలో భారత నౌకా దళానికి ఒక ప్రత్యామ్నాయ నౌకా స్థావరం నిర్మించాలన్న ప్రతిపాదనకు 2009లో అంతిమంగా ఆమోదం లభించినట్లు  సీతారామన్ చెప్పారు.

‘ నేవల్ బేస్ కోసం రాంబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియ చేపట్టిన సమయంలో నిర్వాసితులకు పలు హమీలు ఇచ్చింది. యువతకు ఉపాధి, కేంద్రీయ విద్యాలయం, హెల్త్ సెంటర్లు తదితర సౌకర్యాలు కల్పిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చిన విషయం వాస్తవమేనా’ అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సూటిగా జవాబివ్వకుండా దాటవేశారు. నేవల్ బేస్ నిర్మాణానికి అవసరమైన 4636.71 ఎకరాల భూమిని సేకరించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీని కోసం మార్చి 2005 నుంచి డిసెంబర్ 2017 మధ్య కాలంలో రక్షణ మంత్రిత్వ శాఖ 189.535 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది. పునరావాసం, పునరుద్దరణ, నష్ట పరిహారం చెల్లింపు కోసం మరో 103.005 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.

నేవల్ ప్రాజెక్ట్ కారణంగా ఆశ్రయం కోల్పోయిన కుటుంబాలకు వేరే చోట పునరావాసం కల్పించడంతోపాటు పక్కా ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసినట్లు కూడా మంత్రి వెల్లడించారు. పునరావాస కాలనీల్లో తారు రోడ్లు, విద్యుత్ సరఫరా, తాగు నీటి సౌకర్యం కోసం ఓవర్ హెడ్ ట్యాంక్, కమ్యూనిటీ సెంటర్, స్కూలు, అంగన్ వాడీ, పంచాయతీ భవనంతోపాటు ఇతర ప్రాధమిక వసతులన్నీ కల్పించినట్లు మంత్రి తెలిపారు. నిర్వాసితుల కుటుంబాలలో మిగిలిన 33 మందికి వారి విజ్ఞప్తి మేరకు ఇళ్ల కేటాయింపు జరిగింది. మొత్తం 2733 నేవల్ ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడానికి అవసరమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

విశాఖలో షిప్ బిల్డింగ్ సెంటర్
నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతు వంటి పనులలో నైపుణ్యం పెంపొందించేందుకు విశాఖపట్నంలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్)’ ను ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం రాజ్య సభలోనౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 766 కోట్ల రూపాయల వ్యవయంతో విశాఖపట్నం, ముంబైలో సీఈఎంఎస్ ఏర్పాటు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చులో 87 శాతాన్ని సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్ వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గ్రాంటుగా ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఈ రెండు సెంటర్ల ఏర్పాటుకు అయ్యే మొత్తం 766 కోట్ల రూపాయల వ్యయాన్ని వాయిదా ప్రకారం విడుదల చేస్తున్నాం . మొదటి వాయిదా కింద 25 కోట్ల రూపాలను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. అలాగే ఇండియన్ షిప్పింగ్ రిజిస్ట్రార్ కూడా 50 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం మంజూరు చేసింది. ఈ సెంటర్ల నిర్వహణ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో సెంటర్ లో ఏడాదికి 10,500 మందికి శిక్షణ ఇచ్చే సామర్ధ్యం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా ఈ సెంటర్లు పని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు.

విస్తరణ దిశగా విశాఖ పోర్ట్ పురోగతి
 విస్తరణ దిశగా విశాఖపట్నం పోర్టు పురోగమిస్తున్నట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.  విశాఖపట్నం పోర్టు ఆధునికీకరణ, సామర్ధ్యం పెంపు దిశగా తీసుకుంటున్న చర్యల గురించి విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సుదీర్ఘ వివరణలతో జవాబిచ్చారు. పోర్టు సామర్ధ్యం పెంచేందుకు కొత్తగా అనేక బెర్త్ లు, టెర్మినళ్ళను నిర్మిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. విశాఖపట్నం ఔటర్ హార్బర్ లో జనరల్ కార్గో బెర్త్ స్థాయి పెంపు, కోల్ హాండ్లింగ్ ఫెసిలిటీ యంత్రీకరణ,  కోస్టల్ కార్గో బెర్త్ అభివృద్ధి, కంటైనర్ టెర్మిల్ విస్తరణ, 100 టన్నుల సామర్ధ్య కలిగిన 3 హార్బర్ మొబైల్ క్రేన్ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులతో విశాఖపట్నం పోర్టు విస్తరణ శరవేగంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి వివరించారు. నేపాల్ కు రెండో గేట్ వేగా 2010లో విశాఖపట్నం పోర్ట్ ను ప్రకటించినట్లు మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు