‘ట్రూత్’ చెబుతున్నది ఇదే..

11 Sep, 2015 11:03 IST|Sakshi
‘ట్రూత్’ చెబుతున్నది ఇదే..

నిజనిర్ధారణ సమాచారం కలచివేసే విధంగా ఉండడం వల్ల ప్రధాన మీడియా, పార్లమెంట్ చాలావరకు మౌనముద్ర దాల్చాయని కూడా ‘ట్రూత్’ పేర్కొన్నది. తన నివేదిక ముగింపులో ఇంకా ఇలా చెప్పింది: ‘ఉత్తర దక్షిణ టవర్లు, 47 అంతస్తులు ఉన్న 7వ టవరు జెట్ విమానాల తాకిడి వల్ల, వాటితో వ్యాపించిన మంటలతో గానీ ధ్వంసం కాలేదు. పేలుడు పదార్థాలతో, నియంత్రిత విధ్వంసంతో టవర్స్ నాశనమైనాయి.’  
 
 ‘చరిత్రపుటలకు ఎక్కకుండా వాస్తవాలను పూర్తిగా తొలగించివేశారు.’
 - నోమ్ చామ్‌స్కీ (అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడికి స్పందనగా
 రాసిన గ్రంథం ‘9/11, 2002’ నుంచి)
 ‘మానవులలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. తమకు అనుకూలంగా లేకుంటే చాలు, ఎంతటి సత్యాన్నైనా పొక్కకుండా కప్పెడతారు.’
 -హాన్స్ కోనింగ్ (కొలంబస్ గ్రంథకర్త.
 రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సేనలతో పోరాడి, తరువాత అమెరికాలో స్థిరపడిన హాలెండ్ జాతీయుడు)


సెప్టెంబర్ 11... పదమూడేళ్ల క్రితం (2001) సరిగ్గా ఇదే రోజున చరిత్ర మరువలేని దుర్ఘటన జరిగింది. మరో మూడురోజులలో దీనిని ప్రపంచం మరోసారి గుర్తు చేసుకోబోతున్నది. పాలకులూ, పాలనా వ్యవస్థలూ ప్రపం చంలో ఖండఖండాలలో వారి ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా ఉగ్రవాదం తలెత్తడానికి ఎలా దోహదపడుతూ ఉంటారో, ఉగ్రవాద చర్యలకు ఎలా ఊతం ఇస్తుంటారో ఆలస్యంగా బయటపడుతున్న నిజాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. ట్విన్ టవర్స్ దుశ్చర్యకు సంబంధించి రెండు పరస్పర విరుద్ధ నివేదికలు వెలువడ్డాయి.

అమెరికా పాలకులు (జార్జిబుష్ జూనియర్) అధికారికంగా విడుదల చేసిన కమిషన్ విచారణ నివేదిక.


 పదిహేను వందల మంది సుప్రసిద్ధ అమెరికన్ భవన నిర్మాణ నిపు ణులు (ఆర్కిటెక్ట్స్), ఇంజనీర్లు  విడుదల చేసిన విశిష్ట నివేదిక. అదే ‘ఇన్వెస్టిగేటర్ న్యూస్’. వీరు ‘నిజ నిర్ధారణ ఉద్యమం’ పేరుతో 2010 ప్రాంతంలో ఈ నివేదికను వెలువరించారు.
 
 అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చెందిన ట్విన్ టవర్స్ భవన సముదాయం మీద, అక్కడి ఫ్లారిడా కేంద్రంగా ఏకకాలంలో బయలుదేరిన నాలుగు పౌర విమానాలు దాడి చేశాయి. 110 అంతస్తుల ఆ భవన సముదాయం కుప్పకూలింది. ఆ టవర్స్‌లో నిత్యం పని చేసే 50,000 మంది ఉద్యోగులలో అధికారిక లెక్కల ప్రకారం 3,000 మంది చనిపోయారు. ఇక అమెరికా యుద్ధ తంత్ర కేంద్ర కార్యాలయం పెంటగాన్ మీద జరిగిన విమానదాడిలో 125 మంది చనిపోయారు. వీరితో పాటు మొత్తం ఆ నాలుగు విమానాలలోను ప్రయాణిస్తున్న 256 మంది కూడా చనిపోయారని కూడా ప్రకటించారు. ఈ మృతుల సంఖ్య పెరల్ హార్బర్  మీద జపాన్ చేసిన దాడి (డిసెంబర్ 1941) కారణంగా మరణించినవారి సంఖ్య కంటే ఎక్కువేనని అధికారిక కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.
 
 కొని తెచ్చుకున్న కొరివి
 ఈ విషయంతో పాటే, ‘2001, సెప్టెంబర్ 11తో అమెరికా ఇక మారిపోయిన దేశం’గా అవతరించవలసి వచ్చిందని ప్రకటించింది. ఇంకా, ‘ఇస్లామిస్ట్ ఉగ్రవాదుల బెడద 1990 వరకు లేద’నీ, ఆ తరువాతే ప్రారంభమై, పదేళ్ల వ్యవధిలోనే ఉగ్రవాదం నుంచి ప్రమాదం తీవ్రమైందని కూడా బుష్ ప్రభుత్వ విచారణ కమిషన్ ప్రకటించింది. అంటే, 1990 దాకా లేని ఉగ్రవాద బెడద, తరువాత తలెత్తడానికి ఉన్న పూర్వరంగం అంతా అరబ్ ప్రపంచానికి సంబంధించినదేనని అమెరికా భాష్యం. అక్కడ అప్పటికి ఏకైక సెక్యులర్ శక్తిగా ఉన్న పాలకుడు సద్దాం హుస్సేన్. ప్రజలను మూకుమ్మడిగా హత మార్చే విషపూరిత అణ్వాయుధాలను సద్దాం ప్రభుత్వం రూపొందిస్తున్నదన్న ఆరోపణతోనే ఇరాక్ మీద దాడులకు అమెరికా పథకం రచించింది. ఈ ఆరో పణలను ఐక్యరాజ్య సమితి మొదట ఆమోదించలేదు. కానీ అమెరికా ఒత్తిడి తోనే విచారణ కోసం ‘బ్రిక్స్ కమిషన్’ను నియమించింది. ఇరాక్‌లో తనిఖీలు జరిపిన ఈ కమిషన్ అక్కడ మారణాస్త్రాలను తయారు చేస్తున్నారని చెప్ప డానికి అవసరమైన ఆధారాలు లేవని తేల్చింది.
 
 ఇరాక్ పెట్రోలియం వనరులే లక్ష్యంగా ఉన్న అమెరికా బ్రిక్స్ కమిషన్ తీర్పును ఖాతరు చేయకుండా ఆ దేశం మీద దాడులకు దిగింది. అమెరికా సహా బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మ నీలు కలసిన దుష్టకూటమి జరిపిన దాడి కారణంగా ఇరాక్ సర్వనాశనమైంది. 15 లక్షల మంది హతమయ్యారు. ఇందులో బాలల సంఖ్య 4-5 లక్షలని అంచనా. చివరికి రుజువులు లేని ఆరోపణలతో సద్దాంనూ ఉరితీసింది. వీటన్నిటి ఫలితంగానే ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగింది.  ఈ పరిణామమే అరబ్ ప్రపంచంలోని పెక్కు ప్రభుత్వాలు, వ్యవస్థలు (నిరంకుశ, ప్రజాతంత్ర పాలకులన్న తేడా లేకుండా) కూలిపోవడానికి దోహదపడింది. తిరుగు బాట్లకు కూడా ప్రోత్సాహమిచ్చింది.
 
 పరస్పర విరుద్ధ నివేదికలు
ఇంతకీ సొంత గూటిని కూల్చుకునే పాలకులు చరిత్రలో ఉంటారా అని ప్రశ్నించుకుంటే, ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రం లేకపోలేదు. ముస్సో లినీ, హిట్లర్ ఏం చేశారు? రాజకీయ ప్రాపకం కోసం జర్మనీ పార్లమెంటు రీచ్‌స్టాగ్ భవంతికి  నాజీ మూకల చేత నిప్పు పెట్టించి, ఆ పాపాన్ని హిట్లర్ కమ్యూనిస్టులపైకి నెట్టాడు. అసలు టవర్స్ మీద దాడికి ముందుగానే బుష్ (జూ) మారుమూల ప్రాంతంలో ఎందుకు తలదాచుకోవడానికి వెళ్లినట్టు?  సోవియెట్‌ను బూచిగా చూపి అఫ్ఘానిస్తాన్‌లో తొలి ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని కూల్చడానికీ, మధ్యాసియా సోషలిస్ట్ రిపబ్లిక్‌లోకి చొరబడడానికి ఆ చిన్న దేశాన్ని ముఖద్వారంగా మార్చడానికీ తాలిబాన్‌లను సాకి ఆయుధాలు ఇచ్చింది అమెరికాయే.
 
 తాలిబాన్‌ల నుంచి పుట్టిందే అల్‌కాయిదా ఉగ్రవాదం. అమెరికా అండతోనే ఉన్మాదశక్తులుగా ఎదిగినవాళ్లే ఇస్లామిక్ ఉగ్రవాదులు. వీరిపై బిన్‌లాడెన్ ముద్రవేస్తే గానీ రాజ్య విస్తరణ, సైనిక పారిశ్రామిక విస్త రణ అనే జమిలి పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోవడం అమెరికాకు సాధ్యంకాదు. తన ఉనికి కోసం మెజారిటీ ఉగ్రవాదానికీ, మైనారిటీ ఉగ్రవా దానికీ మధ్య వ్యత్యాసాన్ని చెరిపివేసేదే పెట్టుబడిదారీ వ్యవస్థ అని విస్మరిం చరాదు. బహు శా ఈ పరిణామక్రమాన్ని శ్రద్ధగా అవగాహన చేసుకోవడం వల్లనే, శాస్త్ర సాంకే తిక రంగాలతో దానిని సంధానించబట్టే 9/11 ఘటనకు దారితీసిన కారణాల మీద నిజనిర్ధారణ విచారణ ఉద్యమం (ట్రూత్ మూవ్ మెంట్) అధ్యయనం చేసింది. వాస్తవాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.  
 
 మరో కోణంతో జరిగిన ఈ డాక్యుమెంట్ రచనకు, నిజ నిర్ధారణ ఉద్య మానికి రథసారథి రిచర్డ్ గేజ్. భవన నిర్మాణ, వాస్తు నిపుణుడైన గేజ్ 1,500 మంది నిపుణులతో ట్రూత్ ఉద్యమాన్ని ఆరంభించారు. ఈ విశిష్ట సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 14,000 శాఖలు ఉన్నాయి. ‘మేము దాడి కుట్రకు సంబం ధించిన సిద్ధాంతాల జోలికి పోదలుచుకోలేద’ని కూడా ఆ సంస్థ స్పష్టంగా చెప్పింది. 9/11 ఘటన మీద వచ్చిన అధికారిక నివేదికల గురించి కొన్ని సమాధానాలు కావాలని వారు కోరుతున్నారు. కానీ గత దశాబ్దంగా అమెరికా పాలకులు ఆ ఊసే ఎత్తడం లేదు.
 
 ‘ట్రూత్’ను గమనించాలి
 ‘ఈ దుర్ఘటనలో పలువురు ప్రత్యక్ష సాక్షుల నుంచీ, ముఖ్యుల నుంచీ నేరుగా సాక్ష్యాలు సేకరించాం. ఫొటోలు, వీడియో ఫోరెన్సిక్, శాస్త్రవేత్తల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నాం. కీలకమైన ఈ అంశాలను అధికార నివేదిక విస్మ రించింది. వ్యక్తుల, ఏజెన్సీల సాక్ష్యాలను వక్రీకరించడం లేదా ధ్వంసం చేయ డం జరిగింది’ అని అనధికార నిజనిర్ధారణ  సంస్థ చెబుతోంది. ట్రూత్ సంస్థ వెబ్‌సైట్‌లో ఈ డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. ప్రజలను మరింత చైతన్యవంతం చేసేందుకు ఇందుకు సంబంధించిన సమాచారంతో డీవీడీలు, పత్రాలు, బ్రోచర్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. 2006 మార్చిలో ఈ సంస్థ (ఏఈ 9 11 ట్రూత్) ఆవిర్భవించింది. ఈ సంస్థ విచారణలో కొన్ని వాస్తవాలు వెలుగుచూసిన మాట నిజం. అవి:


*స్వయం చోదిత క్షిపణుల మాదిరిగా పౌర విమానాలు దాడి చేయ డంతోనే ఆ టవర్స్ కూలలేదనీ, రిమోట్ కంట్రోల్ లాగా నియంత్రిత విధ్వంస కాండ (కంట్రోల్డ్ డిమోలిషన్)తోనే కూలాయి.


 *బోయింగ్ 717 వంటి భారీ విమానం డీకొట్టినా తట్టుకు నిలబడగల సామర్థ్యంతో 1-2 టవర్లను పకడ్బందీగా నిర్మించారని భారీ నిర్మాణాల నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు. కానీ అసలు ఫోరెన్సిక్ నిపుణుల సాక్ష్యాలే అధికారిక నివేదికలో లేవు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు.


 *ఇంతటి భారీ స్థాయిలో మానవ ప్రేరితంగా జరిగిన దుర్ఘటన మీద నిష్పాక్షికంగా, సమగ్రంగా విచారణ జరిపించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిజాయితీపరులైన న్యాయశాస్త్ర నిపుణులతో, న్యాయమూర్తులతో, ఇంజనీర్లతో, సామాజిక కార్యకర్తలతో ఆ విచారణ జరిపించాలి.
 
 ఈ విధ్వంసం వెనుక ఉన్న వాస్తవాలను వివరిస్తూ ట్రూత్ సంస్థ అమె రికాలోని 30 నగరాలకు చెందిన, 23 దేశాలకు చెందిన దాదాపు ఏడేసి వందల మందికి 200 చిత్రాలను ప్రదర్శించింది. వీటితో 85 శాతం వీక్షకులు ఆమోదించారు. తన ఫిర్యాదును ప్రతి పార్లమెంట్ సభ్యునికీ కూడా ‘ట్రూత్’ అందించింది. నిజనిర్ధారణ సమాచారం కలచివేసే విధంగా ఉండడం వల్ల ప్రధాన మీడియా, పార్లమెంట్ చాలావరకు మౌనముద్ర దాల్చాయని కూడా ట్రూత్ పేర్కొన్నది.

తన నివేదిక ముగింపులో ఇంకా ఇలా చెప్పింది: ‘ఉత్తర దక్షిణ టవర్లు, 47 అంతస్తులు ఉన్న 7వ టవరు జెట్ విమానాల తాకిడి వల్ల, వాటితో వ్యాపించిన మంటలతో గానీ ధ్వంసం కాలేదు. పేలుడు పదా ర్థాలతో, నియంత్రిత విధ్వంసంతోనే టవర్స్ నాశనమైనాయి.’ కాబట్టి ఈ విధ్వంసానికి సవాలక్ష కారణాలు వెతకాలి. ట్రూత్ నివేదిక చెబుతున్నది ఇదే. మళ్లీ అధికారంలోకి రావడం కోసం మూడు లక్షల నల్లవాళ్ల ఓట్లను మాయం చేసిన వాడికి అమెరికా నుంచి ఉగ్రవాదాన్ని సృష్టించడం కష్టమా?
 (వ్యాసకర్త మొబైల్: 9848318414)
 - ఏబీకే ప్రసాద్,  సీనియర్ సంపాదకులు

మరిన్ని వార్తలు