శత్రుఘ్న సిన్హాకు బీజేపీ షాక్‌

19 Sep, 2018 15:06 IST|Sakshi

పట్నా : తరచూ పార్టీని ఇరుకునపెట్టే  వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పట్నా సాహిబ్‌ నియోజకవర్గం నుంచి బిహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీని బీజేపీ బరిలో దించనుంది. పలు కీలక అంశాలపై పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శత్రుఘ్న సిన్హాకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టికెట్‌ నిరాకరించనున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్ర క్యాబినెట్‌లోకి తనను తీసుకోకపోవడంపై గుర్రుగా ఉన్న సిన్హా కొంత కాలంగా ప్రధాని మోదీకి, పార్టీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో గొంతువిప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని శత్రుఘ్న సిన్హా చెబుతున్న క్రమంలో సుశీల్‌ కుమార్‌ మోదీ పేరును తెరపైకితేవడం ద్వారా అసంతృప్త నేతకు చెక్‌ పెట్టేందుకు బీజేపీ పావులుకదుపుతోంది. వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సిన్హా మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు.

రాఫెల్‌ డీల్‌ సహా పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం, రూపాయి క్షీణత వంటి అంశాలపై విపక్షాల ఆందోళనతో సిన్హా శ్రుతి కలిపారు. జనం సమస్యలతో సతమతమవుతుంటే మనం ఏసీ రూంల నుంచి బయటికి వచ్చి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని మోదీ సర్కార్‌ను ఆయన నిలదీశారు.

మరిన్ని వార్తలు