అసమ్మతి జ్వాల

11 Nov, 2018 02:28 IST|Sakshi

గాంధీభవన్‌ ముందు నకిరేకల్, ఉప్పల్, నాంపల్లి, ఖానాపూర్, మల్కాజ్‌గిరి ఆశావహుల ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి జ్వాలలు అంతకంతకూ పెరుగుతున్నాయి. టికెట్లపై ప్రకటన వెలువడక ముందే సీట్ల కేటాయింపుల్లో తమకు భంగపాటు తప్పదని భావిస్తున్న కాంగ్రెస్‌ ఆశావహులు గాంధీభవన్‌ వేదికగా అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్‌ ఇవ్వాల్సిందేనంటూ ఆందోళన చేపట్టారు. కూటమి పేరు చెప్పి మిత్రపక్షాలకు తమ స్థానాలను కట్టబెడితే ఊరుకోబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

శుక్రవారం నుంచే గాంధీభవన్‌లో నిరసనలు, నినాదాలహోరు మొదలవ్వగా అది శనివారం మరింత పెరిగింది. నకిరేకల్, ఉప్పల్, నాంపల్లి, ఖానాపూర్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు, వారి అనుచరుల ఆందోళనలు, ధర్నాలతో గాంధీభవన్‌ అట్టుడికింది. కాగా, ఉప్పల్‌కు చెందిన ఇద్దరు కార్యకర్తలు శరీరాలపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నిం చడం కలకలం రేపింది.

నినాదాలు... నిరసనలు..
పొత్తుల్లో భాగంగా మల్కాజ్‌గిరి స్థానాన్ని టీజేఎస్‌కు కట్టబెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న నందికంటి శ్రీధర్‌ అనుచరులు శుక్రవారం నుంచే గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. శనివారం సైతం మరోమారు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. టీజేఎస్‌కు టికెట్‌ కట్టబెడితే చిత్తుగా ఓడిస్తామని ప్రకటించారు. ఉప్పల్‌ స్థానాన్ని రాగిడి లక్ష్మారెడ్డికి, నకిరేకల్‌ స్థానాన్ని ప్రసన్నరాజ్, నాంపల్లి సీటును మనోహర్‌బాబుకు కేటాయించాలని వారివారి అనుచరులు, కార్యకర్తలు గాంధీభవన్‌ ముందు ధర్నా చేశారు. తమ అభ్యర్థికే టికెట్‌ ఇవ్వాలంటూ ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు.

లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇద్దరు యువకులు శరీరాలపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై పెట్రోల్‌ పడటంతో గందరగోళం నెలకొంది. మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించడంతో నేతలు క్షమాపణలు చెప్పి వారిని శాం తింపజేశారు. ఈ సందర్భంగానే కొందరు నేతలు గాంధీభవన్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, గాంధీభవన్‌ గేట్లకు తాళాలు వేయడంతో గేటు ముందే నిరసనలు కొనసాగించారు.

నకిరేకల్‌ స్థానం కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారని, వారి హామీ మేరకు నియోజకవర్గంలో పనిచేస్తుంటే, ఇప్పుడు ఇతరులకు కట్టబెట్టడం ఏమిటని ప్రసన్నరాజ్‌ అనుచరులు ప్రశ్నించారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్న మనోహర్‌బాబును కాదని, పార్టీలో కొత్తగా చేరిన పారాచూట్‌ నేతలకు టికెట్‌ ఇవ్వడంపై నాంపల్లి నేతలు కూడా ఆందోళనకు దిగారు. ఖానాపూర్‌ టికెట్‌ను హరినాయక్‌కే ఇవ్వాలంటూ, ఆ నియోజకవర్గ నేతలు శుక్రవారం, శనివారాల్లో ఆందోళన నిర్వహించారు. ఒకవేళ రమేశ్‌ రాథోడ్‌కు టికెట్‌ కేటాయిస్తే చిత్తుగా ఓడిస్తామని నేతలు హెచ్చరించారు.

గాంధీభవన్‌కు రాని ముఖ్యనేతలు..
గాంధీభవన్‌లో నిరసన సెగలు పెరగడంతో పార్టీ సీనియర్‌లెవ్వరూ అటువైపు రావడం లేదు. శనివారం ఒకరిద్దరు నేతలే వచ్చారు. అభ్యర్థుల ప్రకటనకు ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే, ప్రకటన తర్వాత ఇంకెలా ఉంటుందోనని సీనియర్‌ నేతలు ఆందోళన పడుతున్నారు. మున్ముందు మరిన్ని నిరసనలు పెరిగే అవకాశమున్న నేపథ్యంలో గాంధీభవన్‌లో పోలీసు భద్రతను పెంచారు. 100 మందితో భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటికే ఐడీ కార్డు లేకుండా గాంధీభవన్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. గాంధీభవన్‌ రెండు గేట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.  

>
మరిన్ని వార్తలు