పార్లమెంటు చట్టాన్ని గౌరవించండి: కొణతాల

2 Feb, 2018 19:20 IST|Sakshi
మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ

రైల్వే మంత్రికి సుదీర్ఘ లేఖ

సాక్షి, విశాఖపట్నం:  తెలుగు రాష్ట్రం రెండుగా చీలిపోయాక ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామన్న రైల్వే జోన్‌,  ప్రత్యేక హోదా హామీలను బీజేపీ నెరవేర్చాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ శుక్రవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ను కోరారు. ఆయన రైల్వే మంత్రికి రాసిన సుదీర్ఘ లేఖలో ప్రస్తుత బడ్జెట్‌లోనైనా విశాఖరైల్వే జోన్‌ను ప్రకటించాలని విన్నవించారు. పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత కూడా విశాఖ రైల్వే జోన్‌ అంశం కాగితాలకే పరిమితం కావడం బాధాకరమన్నారు.  ఈ విషయమై మాజీ రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుకి రెండు సార్లు అర్జీ పెట్టుకున్నా.. ఫలితం లేకుంగా పోయిందని తెలిపారు. ‘ఏపీ రీ-ఆర్గనైజేషన్‌ బిల్లు, 2014 లోని షెడ్యూల్‌ 3 అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులను కల్సిస్తామని తెలిపింది.  దాంట్లో భాగంగానే ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే జోన్‌ తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ అవసరాలకు రైల్వే జోన్‌ ఏర్పాటు అనివార్యం అయినందున వెంటనే స్పందించండి’ అని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. 

హామీల అమలుకు దిక్కు లేదు..
రైల్వే జోన్‌ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలికాంశాలు విశాఖపట్నం కలిగివుందని  కొణతాల అన్నారు. 1052 కి.మీ.  రైల్వే లైన్‌ వున్న ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన రైల్వేజోన్‌ ఏర్పాటు కొన్ని రాజకీయ కారణాలతోనే జాప్యం అవుతోందని ఆయన విమర్శించారు. ఆదాయార్జనలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న వాల్తేర్‌ డివిజన్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మరో విశేషమని అన్నారు.  ఆర్థికాభివృద్ధి దిశగా సాగుతున్న దేశంలో న్యాయమైన తమ వంతు వాటాకోసం ఉత్తరాంధ్ర ప్రజానీకం కోరుకుంటోందని.. విశాఖ పట్నం హెడ్‌ క్వార్టర్స్‌గా రైల్వే జోన్‌ ఏర్పాటుతో వారి కలలను నిజం చేయాలని విఙ్ఞప్తి చేశారు. 

ఏపీ రీ-ఆర్గనైజేషన్‌ బిల్లులో రాష్ట్రం విడిపోయాక ఆరు నెలల కాలంలోనే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఆ దిశగా అడుగులేయక పోవడం శోచనీయమన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేజీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైల్వే జోన్‌ను చేర్చారని గుర్తు చేశారు. పార్లమెంటు హామీలు కూడా అమలుకు నోచుకోకుంటే ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం పోతుందని నిరసన వెళ్లగక్కారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో చివరి ఈ బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇంకా ఆలస్యం చేసి ప్రజల్లో ఉన్న అసహనాన్ని పెంచొద్దని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు