రాహుల్‌ది పసలేని ప్రసంగం..

18 Mar, 2018 23:12 IST|Sakshi

సాక్షి​, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ 84వ ప్లీనరీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడిపై విమర్శలు చేసిన రాహుల్‌పై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ‘పసలేని ప్రసంగం’గా పేర్కొన్నారు. వాస్తవాలను మాట్లాడాలనీ.. పసలేని ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. ఎన్నికలను మళ్లీ బ్యాలెట్‌ విధానంలో నిర్వహించాలంటున్న రాహుల్‌, టెక్నాలజీ యుగంలో అనాగరికంగా బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. అమిత్‌ షాపై కుట్ర పూరితంగానే హత్య కేసు నమోదైందని, ఆ కేసును కోర్టు కొట్టివేసిన విషయం రాహుల్‌కు తెలియదా? అని ఆమె ప్రశ్నించారు.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో బెయిల్‌పై తిరుగుతున్న రాహుల్‌ ఇలా ఆరోపణలు చేయడం విడ్డూరమని సీతారామన్‌ అన్నారు. సోనియా, రాహుల్‌లు కాంగ్రెస్‌ పార్టీ నిధులను సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌కు చెందిన 300 మిలియన్ డాలర్ల ఆస్తులను అనుభవించడానికి యంగ్‌ ఇండియన్స్‌ అనే షెల్‌ కంపెనీని తెరిచారని విమర్శించారు. ఎమర్జెన్సీని తెచ్చి ఇందిరా గాంధీ, పరువు నష్టం చట్టంతో రాజీవ్‌ గాంధీలు పత్రికల గొంతు నొక్కారని అన్నారు. తమకు వ్యతిరేకమైన కోర్టు తీర్పులు వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడేందుకు ఇందిరా, రాజీవ్‌లు చట్టాలు కూడా తెచ్చారని అన్నారు. అంతటి ‘ఘనుల’ల వారసుడు పత్రికలు, న్యాయ వ్యవస్థల స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారని చురకలంటించారు.

మరిన్ని వార్తలు