మహేశ్‌ ప్రవర్తన దురదృష్టకరం

26 Aug, 2018 08:46 IST|Sakshi

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ/ బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో వరద సమీక్ష సమావేశం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కొడగు జిల్లా ఇంచార్జ్‌ మంత్రి మహేశ్‌ మధ్య జరిగిన వాగ్వాదం మరింత ముదురుతోంది. ఈ విషయంపై శనివారం నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. ‘తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన కన్నడ మంత్రి ప్రవర్తన దురదృష్టకరం’ అని పేర్కొన్నారు. ‘క్షేత్రస్థాయి పర్యటన పూర్తయిన తర్వాత కార్యక్రమ షెడ్యూల్‌ ప్రకారం వరద బాధితుల (ఎక్కువ మంది మాజీ సైనికులున్నారు)తో మాట్లాడుతున్నారు. ఇంతలో జిల్లా ఇంచార్జ్‌ మంత్రి అడ్డుతగిలి.. బాధితులకంటే ముందు అధికారులతో సమావేశమవ్వాలని సూచించారు. దీనిపై కేంద్ర మంత్రి స్పష్టతనిస్తూ.. ఈ సమీక్ష షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతోందని మహేశ్‌కు సూచించారు.

ఆయన మళ్లీ జోక్యం చేసుకుని జిల్లా అధికారులతో సమావేశానికి పట్టుబట్టడంతో మంత్రి నిర్మలా సీతారామన్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బాధితులు, వారితో పాటున్న మీడియా ప్రతినిధుల సమావేశాన్ని మధ్యలోనే ముగించి.. అధికారులతో అదే గదిలో సమావేశమయ్యారు’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. జిల్లా ఉన్నతాధికారులు కేంద్ర మంత్రి కార్యక్రమం షెడ్యూల్‌ను రూపొందించారని.. దాని ప్రకారమే అంతా జరుగుతుండగా జిల్లా ఇంచార్జ్‌ మంత్రి ఇందులో జోక్యం చేసుకోవడం.. ఆ తర్వాత నిర్మలా సీతారామన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని, ఇవి మంత్రి హోదాకు సరిపోవని ఆ ప్రకటన పేర్కొంది. కేంద్ర మంత్రి ప్రవర్తన సరిగా లేదని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర మంత్రి.. కేంద్ర మంత్రి కన్నా తక్కువ ఉండే వ్యక్తి కాదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్‌ అన్నారు.
 

మరిన్ని వార్తలు