‘టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది’ 

14 Jul, 2019 16:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉందని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ఆదివారం గన్నవరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చౌహాన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పాల్గొన్నారు. అనంతరం రోటరీ క్లబ్‌ ఆవరణలో చౌహాన్‌, జీవీఎల్‌ మొక్కలు నాటారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని చౌహాన్‌ ఈ సందర్భంగా తెలిపారు. పేదల అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. టీడీపీ నుంచి అనేక మంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చౌహాన్‌ మాట్లాడుతూ.. బీజేపీ జీరో స్థాయి నుంచి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. ఏపీలో 25 లక్షల సభ్యత్వం తమ లక్ష్యమని తెలిపారు. బూత్‌ స్థాయి నుంచి బీజేపీ బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సేవ చేయాలనుకునే వారికి బీజేపీ పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీని తిట్టడమే తప్ప.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని.. ప్యాకేజీకి అంగీకరించారని గుర్తుచేశారు. ప్యాకేజీకి అనుగుణంగా కేంద్రం అనేక రూపాలలో నిధులు ఇచ్చిందన్నారు. ఏపీకి రూ. 17వేల కోట్ల రూపాయలు ఇస్తే.. ఆ డబ్బులను చంద్రబాబు దారి మళ్లించి తన జేబులో వేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పార్టీని నడపలేకనే.. అధ్యక్ష పదవి నుంచి పారిపోయారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర ముగిసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ నకిలీ గాంధీలతో నిండిపోయిందన్నారు. 

మరిన్ని వార్తలు