బాబును కేంద్రం జైలులో పెడుతుందని అనుకోను

15 Jul, 2019 04:11 IST|Sakshi

ఏదైనా అంశంలో నిజాయితీగా విచారణ జరిపిస్తే గానీ చెప్పలేం 

బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యలు  

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కేంద్ర ప్రభుత్వం జైలులో పెడుతుందని తాను అనుకోవడం లేదని ఇటీవల టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏదైనా అంశంలో నిజాయితీగా విచారణ జరిపిస్తే చెప్పలేమన్నారు. బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా లేదా అన్నది విచారణ జరిపిస్తే గానీ చెప్పలేమని, అయితే పాలన మాత్రం గాడి తప్పిందని చెప్పగలనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అన్యాయం చేయలేదన్నారు.

స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులను మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందని చెప్పారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇస్తానన్న ప్యాకేజీని తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి మంచిదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఈ నెల 24న పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రమంతటా పర్యటిస్తానని చెప్పారు. విజయవాడకు వచ్చిన సుజనా చౌదరికి ఆయన అభిమానులు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ... ఎన్నికల ముందు రాష్ట్రంలో జరిగినవి ధర్మపోరాటాలు కాదు అధర్మ పోరాటాలు అని అన్నారు. విజయవాడలో సుజనా చౌదరి సన్మాన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరు కాలేదు.

చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం: సునీల్‌ దేవ్‌ధర్‌ 
వచ్చే రెండేళ్లలో అవినీతి చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ అన్నారు. విజయవాడలో సుజనా చౌదరి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని దుష్ట కాంగ్రెస్‌ అనేవారని గుర్తుచేశారు. చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీతోనూ కలిసిపోయారని విమర్శించారు. చంద్రబాబు బీజేపీ సహకారం లేకుండా ఎప్పుడూ అధికారంలోకి రాలేదన్నారు.

>
మరిన్ని వార్తలు