పెల్లుబికిన ‍ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే..

27 Feb, 2020 15:23 IST|Sakshi

ఉత్తరాంధ్రలో నిరసన సెగలు..

చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల ఆందోళన

నాలుగు గంటల పాటు కారులో నుంచి కదలని వైనం

విశాఖకు జైకొడితేనే.. ముందుకు కదలనిస్తాం: స్థానికులు

సాక్షి, విశాఖపట్నం : అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఉత్తరాంధ్రలో ఊహించని పరిణామం ఎదురైంది.  పరిపాలనా రాజధానిగా విశాఖ ప్రకటనను వ్యతిరేకిస్తూ.. గురువారం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన ఆయనకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు పర్యటనపై విశాఖపట్నంలో ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో దాదాపు నాలుగు గంటల పాటు వందలాది మంది ప్రజలు, ప్రజా సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వ్యతిరేకంగా రోడ్డును దిగ్బంధించి వాహనాన్ని అంగులం కూడా కదలనీయలేదు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ వారు చేసిన నినాదాలతో అక్కడి ప్రాంతం మారుమోగింది. (చంద్రబాబును అడుగుపెట్టనివ్వం)

చంద్రబాబు వెనక్కివెళ్లాలని కాన్వాయ్‌పైకి ఎక్కి జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు’ అంటున్న చంద్రబాబు నాయుడు విశాఖకు ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. అమరావతిలో టీడీపీ నేతలు అక్రమించిన భూములును, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. మరోవైపు విశాఖ అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి కదలనిచ్చే ప్రసక్తేలేదని మహిళలు రోడ్డుపై బైఠాయించారు. విశాఖకు జైకొడితేనే ఆయన కాన్వాయ్‌ని కదలనిస్తామని, లేకపోతే ఒక్క అంగులం కూడా ముందుకు వెళ్లనీయమని భీష్మించుకుని కూర్చున్నారు. తమ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుని , టీడీపీ నేతలను విశాఖలో అడుగుపెట్టనీయమని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రపై ప్రేమ లేనప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారని మహిళలను నిలదీశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ఇక్కడి ప్రజలే స్వాగతిస్తుంటే టీడీపీ నేతలకు నొప్పెందుకని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు రుచించడంలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖకు వ్యతిరేకంగా టీడీపీ విష ప్రచారం చేస్తోందని,  ఆ పార్టీ తరఫున గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజల తరఫున పోరాడాలని మహిళలను డిమాండ్‌ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తంగా మారటంతో పర్యటన కొనసాగించడం కష్టతరమని పోలీసులు తెలిపారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన విరమించుకుని వెనక్కి తిరిగి వెళ్లాలని పోలీసులు కోరినట్లు తెలిసింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా