‘బాబు అభద్రతా భావంలో కూరుకుపోయారు’

9 May, 2019 14:19 IST|Sakshi

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

సాక్షి, అమరావతి : చంద్రబాబు అసహనంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల రగడ జరుగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆపద్ధర్మ ముఖ్మమంత్రి చంద్రబాబు చేస్తున్న పనులేవీ గతంలో జరుగలేదన్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో ఉద్దేశ పూర్వకంగానే ఎన్నికలు పెట్టారని చంద్రబాబు ఆరోపించడం ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడమేనని మండిపడ్డారు. అవివేకులే ఇలాంటివి చేస్తారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ గెలుస్తారని, సీఎం అవుతారని అర్థమయ్యే చంద్రబాబు ఇటువంటి రగడ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు..
‘ఎలక్షన్ కమిషన్ ఏడవ షెడ్యూల్ ప్రకారం ప్రకృతి వైపరీత్యాల సమయంలో.. ఎలక్షన్ కమిషన్ అనుమతితో సీఎం సమీక్షలు చేయొచ్చు. కానీ మిగతా సమయంలో సమీక్షలు చేయకూడదు. కానీ చంద్రబాబు కావాలనే సమీక్షలు అంటూ రాద్దాంతం చేస్తున్నారు. పోలవరం పర్యటనకు చంద్రబాబు వెళ్తే ఆయన వెనక నిబంధనలు ప్రకారం ఏ అధికారులు వెళ్ళలేదు. దాంతో అసహనానికి గురై చంద్రబాబు.. సీఎస్, సీనియర్ అధికారులపై పలు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని, వైఎస్సార్‌ సీపీ గెలుస్తుందని చంద్రబాబు అసహనానికి గురవుతున్నారు. ఆయన అభద్రతా భావంలో కూరుకుపోయారు’ అని  చంద్రబాబు తీరును ఉమ్మారెడ్డి ఎండగట్టారు.

>
మరిన్ని వార్తలు