విజయం దిశగా ఆసీస్

9 Nov, 2015 00:01 IST|Sakshi

బ్రిస్బేన్: సమష్టిగా రాణిస్తున్న ఆస్ట్రేలియా... న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విజయం దిశగా సాగుతోంది. ఆట నాలుగో రోజు ఆదివారం ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించకుండా ఓవర్‌నైట్ స్కోరు 264/4 వద్దే డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్‌కు 504 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి ఎదురీదుతోంది.

రాస్ టేలర్ (20 బ్యాటింగ్), బ్రెండన్ మెకల్లమ్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో నాలుగోరోజు 53 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓపెనర్లు లాథమ్ (29; 3 ఫోర్లు, ఒక సిక్సర్), గుప్టిల్ (23) తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఆ తర్వాత గుప్టిల్‌తో కలిసి విలియమ్సన్ (59; 6 ఫోర్లు) రెండో వికెట్‌కు 54 పరుగులు జతచేశారు. క్రీజ్‌లో నిలదొక్కుకుంటున్న దశలో గుప్టిల్, విలియమ్సన్‌లను ఆసీస్ స్పిన్నర్ లియోన్ అవుట్ చేశాడు.
 

మరిన్ని వార్తలు