ఆ ఇద్దరి పైనే ఎందుకంత వివక్ష?

12 Jan, 2016 10:18 IST|Sakshi
ఆ ఇద్దరి పైనే ఎందుకంత వివక్ష?

కరాచీ: జట్టు నుంచి కొన్నేళ్లపాటు ఉద్వాసనకు గురై పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ చోటు సంపాదించిన మహమ్మద్ ఆమీర్ తరహాలోనే మరో ఇద్దరికి రెండో అవకాశం కల్పించాలని ఆ జట్టు కోచ్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. ఆమీర్కు ఇచ్చినట్లుగానే స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి నిషేధానికి గురైన బాట్స్మన్ సల్మాన్ బట్, బౌలర్ మహమ్మద్ ఆసిఫ్లకు జట్టులో చోటు కల్పించాలన్నాడు. ఐదేళ్ల నిషేధం తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే బట్ సెంచరీ చేశాడని, ఆసిఫ్ రెండు వికెట్లు తీశాడని.. అయినప్పటికీ ఆ ఇద్దరిపైనే ఎందుకంత వివక్ష అని వ్యాఖ్యానించాడు.

దేశవాలీ క్రికెట్లో బట్, ఆసిఫ్ రాణిస్తున్నారని, వారు ఫిట్నెస్ మెరుగ్గానే ఉందని యూనిస్ పేర్కొన్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకే రకమైన తప్పు చేసి, ఒకే రకమైన శిక్షకు గురయ్యారు. అటువంటిది, ఇప్పుడు ఒకరికి అవకాశం కల్పించి మిగతా ఇద్దరిని జట్టులోకి తీసుకోకపోవడం భావ్యం కాదన్నాడు. బట్, ఆమీర్, ఆసిఫ్ లను ఒకే విధంగా ట్రీట్ చేయాలని గత కొన్ని రోజుల నుంచి పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్, పాక్ టీ20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిలకు వకార్ యూనిస్ సూచించాడు.

ఆమీర్ విషయం, బట్, ఆసిఫ్ వ్యవహారాన్ని ఓకే తీరున చూడలేమని షాహిద్ ఇటీవలే ప్రకటించాడు. కానీ, ఆఫ్రిది ఏం ఆలోచిస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదన్నాడు. బట్, ఆసిఫ్ లను జట్టులోకి ఎందుకు తీసుకోరని యూనిస్ ప్రశ్నించాడు. వారు తప్పుచేసినందుకు ఐదేళ్ల పాటు క్రికెట్ ఆటకు దూరం చేసి శిక్షించారు. ఇప్పుడు వారిని జట్టులోకి తీసుకోవాలని, వారికి స్థానం కల్పిస్తే పాక్ టీమ్కు మంచి జరుగుతందని యూనిస్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు