'మా బ్యాటింగ్ చాలా హేళనగా ఉంది'

21 Dec, 2015 19:46 IST|Sakshi
'మా బ్యాటింగ్ చాలా హేళనగా ఉంది'

హమిల్టన్: న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఘోరంగా విఫలం కావడంతో ఆటగాళ్లపై కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ తీవ్రంగా మండిపడ్డాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించి కూడా మ్యాచ్ ను కోల్పోవడం చాలా అసంతృప్తిగా ఉందన్నాడు. తమ బ్యాటింగ్ చాలా హేళనగా ఉందంటూ విమర్శించాడు.

'మ్యా బాటింగ్ చాలా హేళనగా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో పైచేయి సాధించి కూడా టెస్టు మ్యాచ్ ను నాలుగు రోజుల్లోపే కివీస్ కు సమర్పించాం.రెండో ఇన్నింగ్స్ లో మా బ్యాటింగ్ చాలా ఘోరంగా ఉంది. కనీసం బౌలర్లు పోరాడాలంటే బోర్డుపై సాధ్యమైనన్ని పరుగులుండాలి. దాన్ని చేరుకోలేకపోయాం. మ్యాచ్ ముగిసిన తీరు తీవ్రంగా కలిచివేసింది. కివీస్ బౌలింగ్-బ్యాటింగ్ అద్భుతంగా ఉంది' అని మాథ్యూస్ పేర్కొన్నాడు.

రెండో ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు ఆటలో లంచ్ కు ముందు వరకూ శ్రీలంక 71 పరుగులు చేసి వికెట్ కూడా కోల్పోలేదు. అప్పటికి లంకేయులు 126 పరుగులు ఆధిక్యంలో ఉండటంతో పాటు చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు, మరో 56 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 133 పరుగులకే ఆలౌటైంది.  శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో మాథ్యూస్ (77) ఆకట్టుకోగా, రెండో ఇన్నింగ్స్ లో(2) నిరాశపరిచాడు.

చివరి టెస్టులో శ్రీలంక నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాల్గో రోజు ఆటలో భాగంగా  142/5 ఓవర్ నైట్ స్కోరుతో  సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ మరో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది.న్యూజిలాండ్ ఆటగాళ్లలో విలియమ్సన్(108 నాటౌట్;164 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో రాణించి జట్టు ఘన విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఈ రోజు ఆటలో న్యూజిలాండ్ లంచ్ లోపే విజయం సాధించి సిరీస్ ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది.

మరిన్ని వార్తలు