సచిన్ కంటే అక్తర్ నయం!

22 Jul, 2014 14:05 IST|Sakshi
సచిన్ కంటే అక్తర్ నయం!

తాము రాణించిన రంగాలకు ఎంతో కొంత చేస్తారని పెద్దల సభకు పంపిస్తే సభకు రావడమే లేదు కొంత మంది సెలబ్రిటీలు. ఈ జాబితాలో క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సీనియర్ నటి రేఖ ముందు వరసలో ఉన్నారు. వీరు రాజ్యసభకు హాజరైన రోజులు వేళ్ల మీదే లెక్కింవచ్చంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

సచిన్, రేఖలను యూపీఏ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయడంతో ఆయా రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని భావించారు. మేలు సంగతి పక్కనపెడితే సభలో వీరు కనిపించడమే గగనమైపోయింది. 2012 ఏప్రిల్ 12న నామినేట్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే మాస్టర్ సభకు వచ్చారంటే అవాక్కవలసిందే.

గతేడాది నవంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన సచిన్- సభకు హాజరయ్యే విషయంలో స్పీడ్ పెంచలేదు. రిటైర్ అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే సభలో కాలుపెట్టారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచిన్ ఇప్పటివరకు పెద్దలసభకు హాజరుకాలేదు. గత డిసెంబర్ నుంచి ఈ జూలై వరకు 35 సెషన్స్ నడిచినా సచిన్ కు సమయం చిక్కలేదు

రేఖ ఏడు రోజుల పాటు సభకు హాజరయి సచిన్ బాటలోనే నడిచారు. 2012 మే నుంచి జూలై 2014 మధ్య కాలంలో ఆమె వారం రోజులు సభకు హాజరయ్యారు. సచిన్, రేఖ పాటు నామినేటయిన కవి-రచయిత జావేద్ అక్తర్ వీరి కంటే ఎక్కువ రోజులు సభకు హాజరయి నయమనిపించారు. సభా కార్యక్రమాలను వింటూ ఆయన మౌనమునిగా ఉండిపోయారు.

మరిన్ని వార్తలు