చాంపియన్స్‌ ట్రోఫీ ఇక అనుమానమే!

21 Jun, 2017 01:29 IST|Sakshi
చాంపియన్స్‌ ట్రోఫీ ఇక అనుమానమే!

నాలుగేళ్ల వ్యవధిలో రెండు టి20 ప్రపంచకప్‌లు
లండన్‌: ఇటీవల ముగిసిన చాంపియన్స్‌ ట్రోఫీనే ఇక ఆఖరిది కానుందా..? షెడ్యూల్‌ ప్రకారం 2021లో భారత్‌లో జరగాల్సిన ట్రోఫీ ఇక ఉండదా? ఐసీసీ ఆలోచనలు చూస్తుంటే ఇదంతా వాస్తవంగానే కనిపిస్తోంది. నాలుగేళ్లకోసారి అభిమానులను అలరిస్తున్న చాంపియన్స్‌ ట్రోఫీకి శాశ్వతంగా గుడ్‌బై పలకాలని ఐసీసీ యోచిస్తోంది. టి20 ఫార్మాట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని నాలుగేళ్ల వ్యవధిలో రెండు టి20 ప్రపంచకప్‌లను జరపాలని భావిస్తున్నట్టు ఐసీసీ సీఈవో డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ తెలిపారు.

అయితే ఇప్పటికీ చాంపియన్స్‌ ట్రోఫీకి అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ ఉండటం ఆసక్తికరం. తాజా టోర్నమెంట్‌ను కూడా విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో తిలకించారు. ఇదంతా ఎలా ఉన్నా వచ్చే ట్రోఫీ జరిగేది మాత్రం గ్యారంటీ లేదని, ఈ అంశంపై ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చిస్తామని రిచర్డ్‌సన్‌ తెలిపారు. ‘ప్రస్తుతానికైతే  షెడ్యూల్‌ ప్రకారం తర్వాతి చాంపియన్స్‌ ట్రోఫీ 2021లో భారత్‌లో జరుగుతుంది.

మార్పులు జరిగితే మాత్రం ఈ మధ్య కాలంలో రెండు టి20 ప్రపంచకప్‌లు జరిగే అవకాశం ఉంది. 50 ఓవర్లలో రెండు ప్రపంచకప్‌లు జరపడం అవసరం లేదనిపిస్తోంది. వాస్తవంగా పొట్టి ఫార్మాట్‌లో జరిగే ప్రపంచకప్‌ అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తోంది. టీవీ కంపెనీలకు కూడా అధిక ఆదాయాన్ని అందిస్తోంది. అలాగే భవిష్యత్‌లో 16 లేదా 20 జట్లను ఆడించాలనే ఆలోచన కూడా ఉంది’ అని డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ వివరించారు.

>
మరిన్ని వార్తలు