నగరమంతా ఫ్రీ వైఫై | Sakshi
Sakshi News home page

నగరమంతా ఫ్రీ వైఫై

Published Wed, Jun 21 2017 1:12 AM

నగరమంతా ఫ్రీ వైఫై - Sakshi

1,000 ప్రాంతాల్లో వైఫై హాట్‌ స్పాట్‌ సేవలు
త్వరలో మరో రెండు వేల ప్రాంతాల్లో..
రోజూ 30 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్‌
త్వరలో వరంగల్, కరీంనగర్, ఖమ్మంలకు
..
సాక్షి, హైదరాబాద్‌: ఇక హైదరాబాద్‌ నగరంలో ఎక్కడినుంచైనా ఉచితంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. నగరమంతా ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ నగర హైఫై ప్రాజెక్టు పేరుతో సోమవారం 1,000 ప్రాంతాల్లో హాట్‌స్పాట్‌లు ప్రారంభమవగా.. త్వరలో మరో 2,000 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి నగరాన్నంతా ఉచిత వైఫై నెట్‌వర్క్‌ పరిధిలోకి తీసుకురానున్నారు. షాపింగ్‌ మాల్స్, పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తదితర ప్రాంతాల్లో ప్రజల సౌలభ్యం మేరకు ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది.

ఇంటర్నెట్‌ కంపెనీల అపెక్స్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ (కాయ్‌), ఎయిర్‌టెల్, ఏసీటీ ఫైబర్‌నెట్, ఇండస్‌ టవర్, సీఓఏఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. వైఫై నాణ్యత, బ్యాండ్‌ విడ్త్, డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌ విషయంలో కంపెనీలు పాటించాల్సిన నిబంధనల కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులూ జారీ చేసింది. హాట్‌స్పాట్‌ల ద్వారా 5–10 ఎంబీపీఎస్‌ బ్యాండ్‌ విండ్త్‌ వేగంతో రోజూ 30 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్‌ను నగర ప్రజలు పొందుతారు. కాగా, డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా 2015 జూన్‌లో ‘హైదరాబాద్‌ సిటీ వైఫై’ పేరుతో పైలట్‌ ప్రాజెక్టు కింద 100 రద్దీ ప్రాంతాల్లో వైఫై హాట్‌ స్పాట్‌లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

‘ఉచితం’ మించితే..
ఉచిత వైఫై హాట్‌స్పాట్‌ల వివరాలను జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని నగర మేయర్‌ రామ్మోహన్‌ తెలిపారు. 30 నిమిషాల ఉచిత వినియోగ సమయం తర్వాత సేవలు పొందాలంటే నామమాత్ర చార్జీలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఇంత భారీ సంఖ్యలో ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లు మరో నగరంలో లేవని, అంతటా ఉచిత వైఫై సదుపాయం ఉన్న తొలి నగరంగా హైదరాబాద్‌ చరిత్రకెక్కిందని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా ఉచిత వైఫై ప్రాజెక్టు విజయవంతమవలేదని, హైదరాబాద్‌లోనే విజయవంతంగా అమలు చేస్తున్నామని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తెలిపారు.

హైఫై సిటీ ప్రాజెక్టు ద్వారా నగరంతా ఉచిత వైఫై నెట్‌వర్క్‌ పరిధిలోకి వస్తుందన్నారు. త్వరలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ లాంటి ముఖ్య నగరాలు, పట్టణాలకూ వైఫై ప్రాజెక్టు విస్తరిస్తామని చెప్పారు. ఉచిత వైఫై ప్రాజెక్టు కోసం నగరంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల తవ్వకాలు చేపట్టవద్దని టెలికం కంపెనీలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి సూచించారు. ఉచిత వైఫైతో నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌.మాథ్యూస్, భారతీ ఎయిర్‌టెల్‌ సర్కిల్‌ సీఈఓ వెంకటేశ్‌ విజయ రాఘవన్, ఏసీటీ ఫైబర్‌నెట్‌ సీఈఓ బాల మల్లా, ఇండస్‌ టవర్స్‌ సర్కిల్‌ సీఈఓ సుజీత్‌ సేన్, వైర్‌లెస్‌ బ్రాండ్‌బాండ్‌ అలయెన్స్‌ సీఈఓ శ్రీకాంత్‌ షెన్వాయ్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement