నిషేధం ఎత్తివేయం

19 Apr, 2017 01:41 IST|Sakshi
నిషేధం ఎత్తివేయం

శ్రీశాంత్‌కు తేల్చి చెప్పిన బీసీసీఐ  

న్యూఢిల్లీ: స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి జీవిత కాల నిషేధానికి గురైన పేసర్‌ శ్రీశాంత్‌ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. బీసీసీఐలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఏర్పడిన తర్వాత తనపై నిషేధాన్ని తొలగించాలంటూ కొన్నాళ్ల క్రితం శ్రీ ప్రత్యేకంగా బోర్డుకు లేఖ రాశాడు. స్కాట్లాండ్‌లో లీగ్‌ మ్యాచ్‌లు ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరాడు. అయితే అతనిపై విధించిన నిషేధాన్ని తొలగించే ప్రశ్నే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని బోర్డు అధికారులు శ్రీశాంత్‌కు తెలియజేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బోర్డు తేల్చి చెప్పింది. ‘శ్రీశాంత్‌పై జీవిత కాలం నిషేధం కొనసాగుతుంది. అతను ఎలాంటి పోటీ క్రికెట్‌లోనూ పాల్గొనేందుకు అనుమతించం. ఇదే విషయాన్ని అతనికి తెలియజేశాం. ఫిక్సింగ్‌ విషయంలో శ్రీశాంత్‌ తప్పు లేదంటూ ఏ కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు’  అని బోర్డు ప్రతినిధి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు