‘ఎంఎస్‌ ధోని చెప్పాడనే నా చేతికిచ్చారు’

9 Oct, 2018 11:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్రోఫీ గెలిచిన తర్వాత ఎప్పుడైనా కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ కప్‌ను పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తుంటారు. కానీ,  ఎంఎస్‌ ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరించేవాడు. జట్టు మొత్తానికి కప్ అప్పగించేసి ధోని పక్కన ఉంటడం చాలా సందర్భాల్లో చూశాం. అదే సమయంలో  కుర్రాళ్లను ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడు. ప‍్రధానంగా అరంగేట్రం చేసిన యువ క్రికెటర్లకు మరింత మద్దతుగా నిలిచేవాడు ధోని. ఈ విషయంలో అతను మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు.

ఇప్పుడు ధోని కెప్టెన్ కాకపోయినా జట్టులో అతని మాటకు అధిక ప్రాధాన్యత ఉంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-బంగ్లాదేశ్‌తో తలపడింది. యూఏఈలో భారత జట్టు ఆసియా కప్‌ గెలిచిన సందర్భంగా సంబరాల సమయంలో కొత్త కుర్రాడు ఖలీల్‌ అహ్మద్ చేతుల్లో ట్రోఫీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ధోని సూచన మేరకే రోహిత్ శర్మ అతడి చేతికి ట్రోఫీ ఇప్పించాడట. ఆ విషయాన్ని ఖలీలే స్వయంగా వెల్లడించాడు.

‘వేదిక మీద ట్రోఫీ నా చేతికి ఇవ్వమని కెప్టెన్‌ రోహిత్‌కు ధోనినే చెప్పాడు. ఇదే నాకు అరంగేట్ర సిరీస్‌. జట్టులో అందరి కంటే జూనియర్‌ నేనే కావడంతో ట్రోఫీ నా చేతికి ఇప్పించాడు. అది నాకు మరపురాని అనుభవం' అని ఖలీల్‌ చెప్పాడు. ఆసియాకప్‌లో భాగంగా హాంకాంగ్‌తో అరంగ్రేటం చేసిన మ్యాచ్‌లో ఖలీల్‌ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

మరిన్ని వార్తలు