కోచ్‌గా ద్రవిడ్‌కు రెండేళ్లు పొడిగింపు

1 Jul, 2017 01:20 IST|Sakshi
కోచ్‌గా ద్రవిడ్‌కు రెండేళ్లు పొడిగింపు

న్యూఢిల్లీ: భారత్‌ ‘ఎ’, అండర్‌–19 క్రికెట్‌ జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలాన్ని బీసీసీఐ మరో రెండేళ్లకు పొడిగించింది. 2015లో ద్రవిడ్‌ తొలిసారిగా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన శిక్షణలో రాటుదేలిన కుర్రాళ్లు ఆ వెంటనే అండర్‌–19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌గా నిలిచారు. అలాగే భారత్‌ ‘ఎ’ జట్టు నాలుగు దేశాల సిరీస్‌లో విజేతగా నిలవగలిగింది. ‘క్రమశిక్షణ, అంకితభావంతో యువ ఆటగాళ్లను ద్రవిడ్‌ ముందుకు తీసుకెళుతున్నారు.

గత రెండేళ్లుగా వర్థమాన ఆటగాళ్లను సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే రెండేళ్లు కూడా ఇలాంటి ఫలితాలతోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు. మరోవైపు రెండేళ్ల పూర్తి స్థాయి కోచింగ్‌ బాధ్యతలు తీసుకోనుండటంతో ద్రవిడ్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు మెంటార్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. గతంలో పది నెలల పాటు జాతీయ జట్లకు కోచ్‌గా చేసి రెండు నెలల పాటు ఐపీఎల్‌లో భాగస్వామిగా ఉండేందుకు బోర్డు అనుమతిచ్చింది. అలాగే నిబంధనల ప్రకారమే కోచ్‌ కోసం ఇతర అభ్యర్థులను పిలవకుండా ద్రవిడ్‌కు పొడిగింపునిచ్చినట్టు బోర్డు పేర్కొంది.

మరిన్ని వార్తలు