కివీస్ లక్ష్యం 311

6 Jun, 2017 19:25 IST|Sakshi
కివీస్ లక్ష్యం 311

కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం ఇక్కడ గ్రూప్-ఎలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ 311 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది.  ఓ దశలో ఇంగ్లండ్ తడబడినా ఓవరాల్ గా మెరుగైన ప్రదర్శన కనబరించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో  అలెక్స్ హేల్స్(56;62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జో రూట్(64; 65 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జాస్ బట్లర్(61 నాటౌట్; 48బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలతో మెరవగా, బెన్ స్టోక్స్(48;53 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే జాసన్ రాయ్(13) వికెట్ ను కోల్పోయింది. ఆ సమయంలో హేల్స్ కు జత కలిసిన జో రూట్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ జోడి 81 పరుగులు జోడించిన తరువాత హేల్స్ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆపై కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(13) కూడా వెంటనే పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ 134 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అప్పుడు రూట్-స్టోక్స్ ల జోడి బాధ్యతాయుతంగా ఆడటంతో ఇంగ్లండ్ తిరిగి తేరుకుంది. అటు తరువాత ఇంగ్లండ్ స్వల్ప విరామాల్లో కోల్పోయినప్పటికీ జాస్ బట్లర్ కడవరకూ క్రీజ్ లో ఉండి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. దాంతో ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 310 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో కోరీ అండర్సన్, మిల్నే తలో మూడు వికెట్లు సాధించగా, సౌథీకు రెండు వికెట్లు, బౌల్ట్, సాంత్నార్ లకు చెరో వికెట్ దక్కింది.

మరిన్ని వార్తలు